ముంబై: డిజిటల్ లావాదేవీల వెల్లువతో దేశం దూసుకుపోతుంటే, మరోవైపు ఆన్లైన్ కేటుగాళ్లు అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ సైబర్ దొంగల ఆట కట్టించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక సంచలన మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై మీరు యూపీఐ (UPI) ద్వారా రూ. 10,000 కంటే ఎక్కువ సొమ్ము పంపితే, అది అవతలి వ్యక్తి ఖాతాలో చేరడానికి ఒక గంట సమయం పట్టే అవకాశం ఉంది.
ఏంటి ఈ ‘వన్ అవర్ విండో’ ప్లాన్?
సాధారణంగా యూపీఐ ద్వారా పంపిన డబ్బు క్షణాల్లో అవతలి వారికి అందుతుంది. కానీ కొత్త నిబంధన ప్రకారం, మీరు డబ్బు పంపగానే మీ ఖాతా నుండి కట్ అవుతుంది (Debit), కానీ అవతలి వ్యక్తి ఖాతాలో చేరడానికి (Credit) గంట సమయం పడుతుంది. ఈ గంట సమయాన్ని ఒక ‘సెఫ్టీ విండో’గా ఆర్బీఐ పరిగణిస్తోంది. కేవలం వ్యక్తి నుండి వ్యక్తికి (P2P) జరిగే లావాదేవీలకు మాత్రమే ఈ నిబంధన వర్తించనుంది.
పొరపాటున పంపినా.. వెనక్కి తెచ్చుకోవచ్చు!
ఈ కొత్త విధానంలో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఒకవేళ మీరు పొరపాటున ఎవరికైనా డబ్బు పంపినా లేదా మోసగాడి ఖాతాకు బదిలీ చేసినా.. ఆ ఒక గంటలోపు మీరు ఆ ట్రాన్సాక్షన్‌ను రద్దు (Cancel) చేసుకోవచ్చు. దీనివల్ల మీ సొమ్ము తిరిగి మీ ఖాతాకే చేరుతుంది. బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు కాజేసే (Authorized Push Payment – APP) మోసాలకు ఈ విధానం బలమైన అడ్డుకట్ట వేస్తుందని ఆర్బీఐ భావిస్తోంది.
ఎవరికి మినహాయింపు?
అయితే, అత్యవసర సమయాల్లో ఇబ్బంది కలగకుండా ఆర్బీఐ కొన్ని వెసులుబాటులను కూడా పరిశీలిస్తోంది:
- వైట్ లిస్ట్: మీరు తరచూ డబ్బులు పంపే వ్యక్తులను లేదా నమ్మకస్థులను ‘వైట్ లిస్ట్’లో చేర్చుకుంటే, వారికి పంపే డబ్బుకు ఈ గంట నిరీక్షణ ఉండదు.
- ఓవర్ రైడ్ ఆప్షన్: మీరు పంపే వ్యక్తి ఖచ్చితంగా సరైన వాడే అని మీకు నమ్మకం ఉంటే, ఆ గంట సమయం పట్టకుండానే వెంటనే డబ్బు చేరేలా ‘ఓవర్ రైడ్’ చేసే ఆప్షన్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉంది.
ఎందుకు ఈ కఠిన నిర్ణయం?
గత పదేళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 38 రెట్లు పెరిగాయి. లావాదేవీల విలువ కూడా మూడు రెట్లు పెరిగింది. కానీ, అదే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. ఒకసారి మోసగాడి ఖాతాలోకి డబ్బు చేరితే దాన్ని వెనక్కి తీసుకురావడం పోలీసులకు కూడా కష్టమవుతోంది. అందుకే రూ. 10,000 పైబడిన యూపీఐ, ఐఎంపీఎస్ (IMPS), నెఫ్ట్ (NEFT), ఆర్టీజీఎస్ (RTGS) వంటి అన్ని డిజిటల్ లావాదేవీలపై ఈ ‘కూల్ ఆఫ్’ సమయాన్ని అమలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది.
ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉంది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనే దానిపై ఆర్బీఐ త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.
