ముంబై/న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐ (UPI) లావాదేవీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు మే 1 నుంచి సరికొత్త నిబంధనలను అమల్లోకి తెస్తోంది. ఇకపై కొత్త వ్యక్తులకు పెద్ద మొత్తంలో డబ్బు పంపేటప్పుడు వినియోగదారులు కొంత సమయం వేచి చూడక తప్పదు.
ఏమిటా ‘వన్ అవర్’ నిబంధన?
కొత్త రూల్ ప్రకారం.. మీరు ఎవరికైనా కొత్త వ్యక్తికి (అంతకుముందు లావాదేవీలు జరపని ఖాతాకు) రూ. 10,000 అంతకంటే ఎక్కువ నగదును బదిలీ చేయాలనుకుంటే, ఆ డబ్బు అవతలి వ్యక్తి ఖాతాలో జమ కావడానికి ఒక గంట సమయం పడుతుంది. సైబర్ నేరగాళ్లు ఖాతాలను హ్యాక్ చేసి క్షణాల్లో నగదును మళ్లించకుండా చూసేందుకే ఈ ‘డిలే రూల్’ (Delay Rule)ను ఆర్బీఐ ప్రవేశపెడుతోంది.
ఆ ఒక్క గంటలో ఏం జరుగుతుంది?
సైబర్ కేటుగాళ్లు ఎవరినైనా మోసం చేసి డబ్బులు డ్రా చేస్తే, ఆ నగదు వెంటనే వారి ఖాతాలోకి వెళ్లకుండా గంటపాటు బ్యాంక్ సెంట్రల్ సిస్టమ్‌లో ‘హోల్డ్’లో ఉంటుంది. ఒకవేళ పొరపాటున లేదా మోసపూరితంగా డబ్బు పంపినట్లు బాధితుడు గుర్తిస్తే, ఆ గంట లోపు లావాదేవీని రద్దు చేసుకుని డబ్బును వెనక్కి పొందే అవకాశం ఉంటుంది.
ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించదు?
- కొత్తవారికి మాత్రమే: మీరు ఇదివరకే లావాదేవీలు జరిపిన కాంటాక్ట్ నంబర్లు లేదా ఖాతాలకు డబ్బు పంపితే ఈ నిబంధన వర్తించదు. కేవలం కొత్తగా యాడ్ చేసే వ్యక్తులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది.
- మినహాయింపులు: మర్చంట్ పేమెంట్స్ (దుకాణాల్లో చెల్లింపులు), మెడికల్ ఎమర్జెన్సీ పేమెంట్స్, రికరింగ్ పేమెంట్స్ (ప్రతినెలా ఆటోమేటిక్‌గా కట్ అయ్యేవి) కు ఈ గంట నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు.
సైబర్ మోసాల విలయతాండవం!
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా భారీగా పెరిగాయి. గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది:
- 2021లో: 2.6 లక్షల డిజిటల్ మోసాలు నమోదయ్యాయి.
- 2025లో: ఈ సంఖ్య ఏకంగా 28 లక్షలకు చేరింది.
- నష్టం: 2025 ఏడాదిలోనే సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి సుమారు రూ. 22,931 కోట్లను లూటీ చేశారు.
ఈ భయంకరమైన దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే లావాదేవీల్లో కొంత జాప్యం తప్పదని ఆర్బీఐ భావిస్తోంది. కాబట్టి మే 1 నుంచి కొత్త వ్యక్తులకు నగదు పంపేటప్పుడు ఈ గంట నిబంధనను దృష్టిలో ఉంచుకుని మీ ప్లాన్ సిద్ధం చేసుకోండి.
