భారతదేశంలో ఎన్నికల సమయంలో అత్యధికంగా హత్యలు జరిగే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్థానిక నాయకత్వంలోని ‘బైక్ బ్రిగేడ్’ గతంలో విస్తృతంగా హింసను ప్రేరేపించేది.
అయితే ఈసారి దాదాపు రెండున్నర లక్షల మంది కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికల సంఘం ఈ హింసను అరికట్టింది. పోలింగ్ బూత్‌ల పరిసరాల్లో రాష్ట్ర పోలీసులను అనుమతించకుండా, పూర్తిగా కేంద్ర బలగాల నియంత్రణలో ఎన్నికలు నిర్వహించారు. దీనివల్ల తృణమూల్ గుండాయిజం సాగలేదు మరియు పోలింగ్ శాతం పెరిగింది. కానీ, ఎన్నికల తర్వాత బెంగాల్లో హింస చెలరేగింది. ఇప్పటి వరకు నలుగురు మరణించారు. మమతా బెనర్జీ పాలన పోవడంతో, గతంలో దెబ్బలు తిన్న బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు దీటుగా బదులిస్తున్నారు.
రాజకీయ హింస – మరణాలు
బీర్బం జిల్లాలో అబీర్ షేక్ (TMC), కోల్‌కతాలో బిశ్వజిత్ పట్నాయక్ (TMC) హత్యకు గురయ్యారు. దీనికి ప్రతీకారంగా హౌరాలో యాదవ్ బార్ (BJP), న్యూ టౌన్లో మధు మొండల్ (BJP) హత్యకు గురైనట్లు నివేదికలు చెబుతున్నాయి. కోల్‌కతా, బీర్బం, జల్పాయ్గురి వంటి ప్రాంతాల్లో హింస చెలరేగింది. హింసకు పాల్పడే వారిపై ‘జీరో టాలరెన్స్’ పాటించాలని మరియు తక్షణమే అరెస్టులు చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదేశించారు.
‘యూపీ సింహం’ రంగప్రవేశం
యోగి ఆదిత్యనాథ్ ప్రియతమ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఈసారి బెంగాల్లో పోలీస్ అబ్జర్వర్‌గా నియమించారు. 100కు పైగా ఎన్కౌంటర్లు చేసిన ఆయనను ‘షేర్ ఆఫ్ యూపీ’ అని పిలుస్తారు. ముఖ్యంగా సౌత్ 24 పరగణాల వంటి టీఎంసీ కోటల్లో ఆయనను ఎన్నికల సంఘం నియమించింది.
ఫాల్టా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఓటర్లను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదుతో శర్మ నేరుగా ఆయన ఇంటికి వెళ్లి హెచ్చరించారు. స్థానిక పోలీసులు సహకరించకపోయినా, స్వయంగా ఇల్లు వెతికి పట్టుకుని, “ఎవరైనా గుండాయిజం చేస్తే సరైన రీతిలో బుద్ధి చెబుతాం, ఆ తర్వాత వచ్చి ఏడ్చినా లాభం లేదు” అని హెచ్చరించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో గుండాల్లో వణుకు మొదలైంది. దీనిపై టీఎంసీ సుప్రీంకోర్టుకు వెళ్లినా చుక్కెదురైంది.
మమత చిత్రాల ధ్వంసం – సీపీఎం కార్యాలయాల పునఃప్రారంభం
అధికారం చేజారడంతో టీఎంసీ బైక్ బ్రిగేడ్ సభ్యులు చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లారు, కొందరు బంగ్లాదేశ్‌కు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎగ్జిట్ పోల్స్‌లో స్పందించడానికి భయపడిన ప్రజలు, ఇప్పుడు బహిరంగంగానే మమతా బెనర్జీ పోస్టర్లు, చిత్రాలను తగలబెడుతున్నారు.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, గత 10 ఏళ్లుగా టీఎంసీ దాడులకు భయపడి మూతపడిన సీపీఎం (CPM) కార్యాలయాలు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఉత్తర దినాజ్‌పూర్, సౌత్ 24 పరగణాల జిల్లాల్లో దశాబ్ద కాలంగా మూతపడిన పార్టీ కార్యాలయాలను కార్యకర్తలు మళ్లీ ప్రారంభించారు. బెంగాల్లో బీజేపీ బలం పెరగడంతో, సీపీఎంకు కూడా పని చేసుకునే స్వేచ్ఛ తిరిగి వచ్చినట్లయింది.
