యోగా శిక్షణ కోసం జపాన్ నుంచి వచ్చిన 57 ఏళ్ల మహిళపై లైంగిక దాడి.. మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు అత్యాచారం చేశాడని ట్రైనర్‌పై ఆరోపణలు!

శిక్షణ కోసం నమ్మకంతో వచ్చిన మహిళకు రక్షణ కల్పించాల్సిన యోగా కేంద్రం నిర్వాహకుడే వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కేరళలోని వర్కలాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

జపాన్‌కు చెందిన 57 ఏళ్ల మహిళ యోగా టీచర్‌ శిక్షణ పొందేందుకు గత సెప్టెంబర్‌లో కేరళకు వచ్చారు. అయితే, ఆ యోగా కేంద్రం నిర్వాహకుడైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి తనపై మూడు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. అక్టోబర్ 28, 30, 31 తేదీల్లో ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 28న రాత్రి భోజనం తర్వాత మసాజ్ చేస్తానని చెప్పి యోగా హాల్‌కు తీసుకెళ్లి నిందితుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. ఆ తర్వాతి రోజుల్లో తన గది తలుపు తట్టి, మరోసారి తన గదికి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

శిక్షణ కోసం చెల్లించిన డబ్బు, వసతి, శిక్షణ సర్టిఫికెట్ కోల్పోతాననే భయంతో మొదట్లో గట్టిగా ఎదిరించలేకపోయానని బాధితురాలు తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా, విదేశం నుంచి ఒంటరిగా వచ్చిన తనకు స్థానికంగా ఎవరూ అండగా లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఎదురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకరోజు తరగతులు లేకపోవడంతో యోగా కేంద్రంలో ఉండటం సురక్షితం కాదని భావించి, తిరువనంతపురంలోని ఓ షాపింగ్ మాల్‌లో రోజంతా గడిపినట్లు ఆమె వెల్లడించారు. తనకు సరైన ఆహార సదుపాయాలు కల్పించకపోయినా, యోగా కేంద్రానికి అనుకూలంగా మంచి రివ్యూ ఇవ్వాలని నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారని కూడా ఆరోపించారు.

ఈ ఘటన తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని బాధితురాలు తెలిపారు. ప్రస్తుతం వైద్య పరీక్షలతో పాటు మానసిక కౌన్సెలింగ్ కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భాషా సమస్యలు, స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల విదేశాల నుంచి శిక్షణ కోసం వచ్చే మహిళలు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతోనే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొన్నారు. నిందితుడిపై కొత్త క్రిమినల్ చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు కథనం వెల్లడించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *