చిక్కబళ్లాపూర్: ‘ప్రేమకు కళ్లు లేవు’ అనే మాటకు నిదర్శనంగా, చిక్కబళ్లాపూర్ జిల్లాలో రక్తసంబంధాన్ని కూడా మరిచి వరుసకు అక్కాతమ్ముళ్లు అయ్యే ఇద్దరు పెళ్లి పీటలెక్కిన వింత ఘటన చోటుచేసుకుంది. వరుసకు అక్కాతమ్ముళ్లు కావాల్సిన ఈ జోడి ఇప్పుడు సప్తపది తొక్కడం సామాజిక చర్చకు దారితీసింది.
దేవనహళ్లిలోని సావకనహళ్లికి చెందిన శశికళ, హోసకోటకు చెందిన ప్రవీణ్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విశేషమేమిటంటే, వీరిద్దరి తల్లులు స్వయానా అక్కాచెల్లెళ్లు. అంటే వరుసకు శశికళ మరియు ప్రవీణ్ అక్కాతమ్ముళ్లు అవుతారు. అయితే ఈ బంధం యొక్క సరిహద్దులను దాటి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
శశికళకు ఆమె తల్లిదండ్రులు వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించి, శుభలేఖలు కూడా పంచారు. తీరా తాళి కట్టే సమయానికి శశికళ తన ప్రియుడు ప్రవీణ్‌తో కలిసి పారిపోయింది. అనంతరం వీరిద్దరూ అంగట్టలోని శివాలయంలో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారు.
వివాహం తర్వాత తమ తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ, రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నవజంట చిక్కబళ్లాపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో కార్యాలయ ఆవరణలో హైడ్రామా చోటుచేసుకుంది. తన కూతురి పెళ్లిని చూసి తల్లి రోదనలు మిన్నంటాయి. “అక్క కూతురివి అయ్యుండి తమ్ముడినే పెళ్లి చేసుకున్నావా? ఈ సంబంధాన్ని సమాజం ఒప్పుకుంటుందా?” అని ఆ తల్లి తన కూతురిని ప్రశ్నిస్తూ కన్నీరుమున్నీరయ్యారు.
అయినప్పటికీ, శశికళ మాత్రం తగ్గలేదు. “నాకు నా ప్రియుడే సర్వస్వం, నేను తల్లిదండ్రులతో వెళ్లను” అని భీష్మించుక కూర్చుంది. ప్రస్తుతం ఈ వింత వివాహ ఉదంతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
