న్యూఢిల్లీ: రష్యా నుండి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తున్నప్పుడు అమెరికా నీతి పాఠాలు చెప్పిన రోజులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. భారత్ తమ ఒత్తిడికి లొంగడం లేదని డోనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్ విధిస్తామని బెదిరించారు. రష్యా నుండి ఒక్క చుక్క చమురు కూడా కొనకూడదని ఆంక్షలు పెట్టారు. కానీ ఈరోజు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద తమ పీక పడటంతో ఆ అహంకారమంతా ఆవిరైపోయింది. అదే అమెరికా, అదే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ఇప్పుడు భారత్ ముందు చేతులు కట్టుకుని నిలబడి, “ప్రపంచ మార్కెట్‌ను ధరల మంటల నుండి కాపాడటానికి భారత్ రష్యా నుండి చమురు కొనాలి” అని వేడుకుంటున్నాయి.
అమెరికా నిస్సహాయతకు నిదర్శనం
ఒకప్పుడు భారత్‌ను బెదిరించిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో సరఫరా తగ్గకూడదని భారత్‌కు 30 రోజుల వెసులుబాటు ఇస్తున్నామని చెబుతున్నారు. ఇది భారత్‌పై చూపిస్తున్న దయ కాదు, అమెరికా తన నిస్సహాయతను బహిరంగంగా ఒప్పుకోవడమే. రష్యా ఖజానా ఖాళీ అవ్వాలని కోరుకున్న వాషింగ్టన్, ఈరోజు అమెరికాలో పెట్రోల్ ధరలు పెరగకుండా ఉండటం కోసం భారత్ రష్యాకు డబ్బు చెల్లించి చమురు కొనాలని కోరుతోంది.
తగ్గేదే లే.. రష్యా నుండి 50 శాతం పెరిగిన కొనుగోళ్లు!
ట్రంప్ చెప్పారని భారత్ తన వ్యూహాన్ని మార్చుకోలేదు. పైగా రష్యా నుండి చమురు కొనుగోళ్లను 50 శాతం పెంచింది.
డేటా: ఫిబ్రవరిలో భారత్ రష్యా నుండి రోజుకు 10.4 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేయగా, మార్చి నాటికి అది రోజుకు 15 లక్షల బ్యారెళ్లకు పెరిగింది. అంటే నేరుగా ఒకటిన్నర రెట్లు పెరిగింది.
జయశంకర్ మరియు రష్యా విదేశాంగ మంత్రి చర్చలు
ఇదే సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అధికారికంగా వీరు ఇరాన్ పరిస్థితిపై చర్చించారని చెబుతున్నప్పటికీ, రష్యా చమురు సరఫరా మరియు కొనుగోలు వ్యూహాల గురించే అసలు చర్చ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత ఓడరేవుల వైపు 13 కోట్ల బ్యారెళ్ల చమురు!
డేటా అనలిటిక్స్ సంస్థ ‘కెప్లర్’ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం సముద్రంలో సుమారు 13 కోట్ల బ్యారెళ్ల రష్యా చమురు సిద్ధంగా ఉంది. హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అడ్డంకులు మరియు పాశ్చాత్య దేశాల తాజా అనుమతుల తర్వాత, ఈ చమురు నౌకలన్నీ వేగంగా భారత ఓడరేవుల వైపు మళ్లే అవకాశం ఉంది. భారత్ త్వరలోనే తన మొత్తం ముడి చమురు అవసరాలలో 40-45 శాతం తిరిగి రష్యా నుండే దిగుమతి చేసుకునే స్థితికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
