రష్యా సెంట్రల్ బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క బడ్జెట్ ప్రణాళికకు నిధులు సమకూర్చే చర్యలో భాగంగా, తన నిల్వల నుండి మొదటిసారిగా బంగారాన్ని విక్రయించడం ప్రారంభించింది.
రష్యా చరిత్రలో తొలిసారిగా అధిక స్థాయిలో బంగారం అమ్మకాలు జరుగుతున్నాయి.
ప్రపంచ బంగారం నిల్వలు
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కలిగి ఉన్న మొత్తం బంగారం నిల్వ 2009లో 26,000 టన్నులుగా ఉండగా, 2024 నాటికి అది 32,000 టన్నులకు పెరిగింది. గత 4 నెలల్లోనే ఈ బ్యాంకులు రెండున్నర టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయి.
భారతదేశంతో సహా ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకులు ఇందులో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి. అంటే, ప్రపంచంలో ఉన్న బంగారంలో 76% ఈ 10 దేశాల వద్దే ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం, 2009 నుండి 2024 వరకు సెంట్రల్ బ్యాంకుల బంగారు నిల్వలు ఏటా 4.1% చొప్పున పెరిగాయని తెలుపుతోంది. ఈ టాప్ 10 దేశాలలో అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జపాన్, నెదర్లాండ్స్, చైనా, రష్యా మరియు భారతదేశం ఉన్నాయి.
బంగారాన్ని అమ్ముతున్న రష్యా
ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఒక్కసారిగా బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ బంగారాన్ని విక్రయించింది. ఇది నేషనల్ వెల్త్ ఫండ్ (NWF) నుండి గతంలో జరిగిన బంగారు లావాదేవీల మాదిరిగానే ఉంది. రష్యా యొక్క బంగారు నిల్వలు 2,300 టన్నులకు పైగా ఉన్నాయి, ఇది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద నిల్వ.
సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ, “ఇటీవలి సంవత్సరాలలో దేశీయ బంగారు మార్కెట్లో నగదు లభ్యత (Liquidity) పెరిగినందున, రష్యన్ బ్యాంక్ ఇప్పుడు దేశీయ మార్కెట్లో యువాన్ లావాదేవీల ద్వారా మాత్రమే కాకుండా, బంగారం ద్వారా కూడా లావాదేవీల కార్యకలాపాలు నిర్వహిస్తోంది” అని తెలిపారు.
ఈ అమ్మకం యొక్క సమయం లేదా పరిమాణం గురించి బ్యాంక్ సమాచారాన్ని విడుదల చేయలేదు. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడికి ముందు, NWF లో 405.7 టన్నుల బంగారం ఉండేది.
రష్యా వద్ద ఎంత బంగారం ఉంది?
అనంతరం, ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి 57% లేదా 232.6 టన్నుల బంగారాన్ని విక్రయించింది. నవంబర్ 1 నాటికి 173.1 టన్నుల బంగారం మిగిలి ఉంది. బంగారం మరియు యువాన్‌తో సహా NWF యొక్క మొత్తం నగదు ఆస్తులు 55% తగ్గి $51.6 బిలియన్లకు చేరుకున్నాయి.
ఈ బంగారం అమ్మకం, రూబుల్‌కు మద్దతుగా మార్కెట్లోకి కరెన్సీని విడుదల చేయడానికి సెంట్రల్ బ్యాంక్‌కు సహాయపడుతుంది మరియు యువాన్ నిల్వలపై ఒత్తిడిని తగ్గిస్తుంది అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
బంగారం అమ్మకం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
రష్యా బంగారాన్ని విక్రయించడం వలన అంతర్జాతీయంగా బంగారం లభ్యత (Supply) పెరుగుతుంది. అంటే ఇతర దేశాలు బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయగలవు. దీనివల్ల బంగారం ధర తగ్గుతుంది. బంగారం ధర వేగంగా పడిపోయే అవకాశం ఉంది. ఇతర దేశాలు కూడా బంగారాన్ని అమ్మడం మొదలుపెడితే దాని ధర వేగంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చైనా తమ వద్ద ఉన్న అనేక టన్నుల బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది అనేది గమనార్హం.
