వర్షాకాలం రాగానే మార్కెట్లలో పచ్చటి ఆకుకూరలు, కొత్తిమీర కట్టలు గుట్టలుగా పడటం ప్రారంభమవుతుంది.
కూరల నుండి రసం వరకు కొత్తిమీర లేని వంటకాలే మన ఇళ్లలో ఉండవు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్న ఒక వీడియో, మీరు తదుపరిసారి కొత్తిమీర కొనేటప్పుడు ఖచ్చితంగా మీ చేతులను వణికించేలా చేస్తుంది.
సాధారణంగా, వర్షాకాలంలో నెలకొనే చల్లని, తేమతో కూడిన వాతావరణం కారణంగా పాములు, తేళ్లు వంటి సరిసృపాలు తమకు రక్షణగా ఉండే ప్రదేశాల కోసం వెతుకుతుంటాయి. అలాంటివి తరచుగా పొదలు లేదా మార్కెట్లలో పేర్చి ఉంచిన తేమతో కూడిన ఆకుకూరలు, కొత్తిమీర కట్టల లోపలికి సులభంగా దూరిపోతాయి. అలాంటి ఒక షాకింగ్ ఘటన గత సంవత్సరం ఇంటర్నెట్ను కుదిపేసింది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండటానికి ఆ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది.
ఆ భయంకరమైన వీడియోలో, ఒక యువకుడు రోడ్డు పక్కన అమ్మే కొత్తిమీర కట్టలను ఒక్కొక్కటిగా తీసి పక్కకు జరుపుతున్నాడు. చూడటానికి అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ, అతను చివరి కొత్తిమీర కట్టను చేతితో పైకి లేపిన ఆ క్షణం… దాని కింద చుట్టుకుని పడుకున్న ఒక చిన్న పాము మెరుపు వేగంతో బుసకొడుతూ బయటకు దూకింది! ఊహించని ఈ ప్రమాదాన్ని చూసి అక్కడున్న వారి కడుపులో నీళ్లు మెదిలాయి. ఆ పాము అసుర వేగాన్ని చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో వివరాలు తెలియకపోయినప్పటికీ, దీన్ని చూసిన నెటిజన్లు “ఇకపై కొత్తిమీర కొనేటప్పుడు 10 సార్లు చెక్ చేయాలి బాబోయ్” అని కామెంట్ చేస్తున్నారు. దీనిపై హెచ్చరించే నిపుణులు, “కూరగాయలను లేదా ఆకుకూరలను ఇంటికి తీసుకురాగానే, హడావుడిగా కోయకూడదు. ప్రతి కట్టను విడివిడిగా విడదీసి, బాగా దులిపి చూడాలి. ఒకవేళ పాము వంటి ప్రమాదకరమైన జీవులు ఉంటే, దాన్ని మీరే సొంతంగా కొట్టడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా, వెంటనే స్నేక్ క్యాచర్లకు లేదా అటవీ శాఖకు సమాచారం ఇవ్వడమే బుద్ధిమంతం” అని సూచిస్తున్నారు.
