రాంగ్ నంబర్‌తో మొదలైన పరిచయం.. ప్రేమగా మారి చివరకు బ్లాక్‌మెయిలింగ్‌కు దారితీసిన వైనం!

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వైద్యుని భార్యను తన మాయమాటలతో బురిడీ కొట్టించిన కేటుగాడు, ఆమె నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ముందుగా స్నేహం, ఆపై ప్రేమ పేరుతో నమ్మించి, ఆమె అభ్యంతరకర వీడియోలను సంపాదించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.

విదేశాల నుండి ఖరీదైన గిఫ్ట్‌లు పంపిస్తానని నమ్మించి ఆమె నుండి రూ. 3.76 లక్షలు కాజేశాడు. ఆపై ఆమె వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. వేధింపులు భరించలేక సదరు మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం బయటపడింది.

పరిచయం ఎలా మొదలైందంటే.. బాధితురాలు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు నెల రోజుల క్రితం ఆమె వాట్సాప్‌కు ‘+92’ (పాకిస్థాన్ కోడ్)తో మొదలయ్యే నంబర్ నుండి ‘హాయ్’ అని మెసేజ్ వచ్చింది. ఎవరని ప్రశ్నించగా, తన పేరు విపిన్ అని, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె నంబర్ దొరికిందని చెప్పి స్నేహం చేయాలని కోరాడు. మెల్లమెల్లగా మాటలు పెరిగి అది ప్రేమకు దారితీసింది.

నమ్మించి వీడియోలు సంపాదించాడు: మాటల మధ్యలో తాను లండన్‌లో నివసించే ఎన్‌ఆర్‌ఐ (NRI) అని సదరు వ్యక్తి నమ్మించాడు. ఆమెను లండన్ రావాలని కోరగా, తనకు పెళ్లయిందని ఆమె నిరాకరించింది. అయినా వారి చాటింగ్ కొనసాగింది. ఒకరోజు ఆమెను నమ్మించి న్యూడ్ వీడియో పంపాలని కోరాడు. ఆమె మొదట నిరాకరించినా, నిందితుడు పట్టుబట్టడంతో వీడియో పంపింది. ఆ తర్వాత గిఫ్ట్‌లు పంపిస్తాననే నెపంతో ఆమె ఆధార్ కార్డు వివరాలను కూడా సేకరించాడు.

బ్లాక్‌మెయిలింగ్ మరియు మోసం: విదేశాల నుండి వచ్చిన గిఫ్ట్‌లు మరియు డాలర్లకు కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ కట్టాలని చెప్పి ఐదు విడతల్లో మొత్తం రూ. 3.76 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత మరో రూ. 2.85 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో, తన వద్ద ఉన్న వీడియోను వైరల్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆ వీడియోను కొందరికి పంపి, ఆమె బంధువులకు కూడా ఫోన్ చేయడం ప్రారంభించాడు. దీంతో భయపడిపోయిన ఆమె తన సోదరుడికి విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: