న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత రాఘవ్ చద్దా చుట్టూ ముసురుకున్న వివాదంలో సరికొత్త, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో రాఘవ్ చద్దాపై దాడి జరిగిందని హర్యానా మాజీ ఆప్ అధ్యక్షుడు నవీన్ జైహింద్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇటీవలే రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించిన నేపథ్యంలో, పార్టీకి ఆయనకు మధ్య విభేదాలు తీవ్రమైనట్లు తెలుస్తోంది.
‘శీష్ మహల్’లో దాడి జరిగిందా? నవీన్ జైహింద్ ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ, రాఘవ్ చద్దాను ‘శీష్ మహల్’గా పిలవబడే ముఖ్యమంత్రి నివాసానికి పిలిపించి అక్కడ భౌతిక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. “అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయనను కొట్టారు. ఈ విషయాన్ని ఆయన ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?” అని జైహింద్ ప్రశ్నించారు.
‘ఏడుస్తూనే ఉన్నారు’ ఆ సమయంలో జరిగిన దాడి వల్లే రాఘవ్ చద్దా కంటికి గాయమైందని, అందుకే ఆయన లండన్ వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని జైహింద్ ఆరోపించారు. “ఆ సమయంలో ఆయన ఏడుస్తూనే ఉన్నారు. కంటికి దెబ్బ తగిలితే ఇంగ్లాండ్ వెళ్లి బాగు చేయించుకున్నారు.. ఆ విషయం ఎందుకు దాస్తున్నారు?” అని ఆయన నిలదీశారు. అక్కడ జరిగిన డీలింగ్స్ గురించి, సూట్‌కేసుల గురించి నోరు విప్పాలని, దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న ఆ నలుగురు వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని రాఘవ్ చద్దాను డిమాండ్ చేశారు.
‘ధైర్యం చూపించు రాఘవ్’ గతంలో ఎంపీ స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ నివాసంలోనే దాడి జరిగిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. “ఒక మహిళా ఎంపీకి ఉన్న ధైర్యం కూడా నీకు లేదా? నీపై దాడి జరిగిందని చెప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నావు? కొంచెం ధైర్యం చూపించు రాఘవ్” అంటూ నవీన్ జైహింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024లో స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
