రాఘవ్ చద్దా మరో ఆరుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలతో కలిసి బీజేపీలో చేరిన తర్వాత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మాజీ సహచరుడిపై ఘాటుగా స్పందించారు. కేవలం పేరుతోనే కాకుండా, ఒక ఇంటి నంబర్‌ను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.
“వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆప్‌లో ఊపిరి ఆడడం లేదని చెబుతున్న ఒక రాజ్యసభ సభ్యుడు.. గతంలో ‘కోఠీ నంబర్ 50’లో ఉండి అధికార ఫలాలను అనుభవించారు” అని మాన్ చండీగఢ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ వీడిన ఏడుగురిని ‘గద్దర్’ (ద్రోహులు) అని పిలిచారు.
ఏమిటీ ‘కోఠీ నంబర్ 50’ కథ? చండీగఢ్‌లోని సెక్టార్ 2లో ఉన్న ‘కోఠీ నంబర్ 50’ ఒక భారీ బంగ్లా. ఇది ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి అతి సమీపంలో ఉంది. 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం సీఎం క్యాంపు ఆఫీస్ కోటాలోకి వస్తుంది. 2022లో ఆప్ గెలిచిన మొదటి రెండేళ్లలో రాఘవ్ చద్దా చండీగఢ్ వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారు. ఆ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చద్దాను కలవడానికి ఈ ఇంటి వద్ద క్యూ కట్టేవారు. అందుకే ప్రతిపక్షాలు ఆయనను పంజాబ్ ‘సూపర్ సీఎం’ అని, ఈ ఇల్లు ‘సమాంతర అధికార కేంద్రం’ అని విమర్శించేవి.
సొంత పార్టీ నేతల అసంతృప్తి: రాఘవ్ చద్దాకు అంతటి అధికారం ఇవ్వడం పార్టీ చేసిన పొరపాటని ఆప్ లోక్‌సభ ఎంపీ మల్వీందర్ సింగ్ కాంగ్ వ్యాఖ్యానించారు. “మేం రాఘవ్ చద్దాను ఆకాశానికి ఎత్తేశాం. సీఎం మాన్ నిర్ణయాల్లో ఆయన జోక్యం చేసుకునేవారు” అని కాంగ్ పేర్కొన్నారు. పంజాబ్ నుండి ఆప్‌కు మిగిలిన ఏకైక రాజ్యసభ ఎంపీ బల్బీర్ సింగ్ సీచేవాల్ కూడా స్పందిస్తూ.. “ఆ సమయంలో పంజాబ్ పాలన అంతా కోఠీ నంబర్ 50 కనుసన్నల్లోనే సాగేది. ఇప్పుడు ఏమైందో వారికే తెలియాలి” అని అన్నారు.
ప్రతిపక్షాల విమర్శలు: గతంలో రాఘవ్ చద్దాను ‘సూపర్ సీఎం’ అని విమర్శించిన బీజేపీ నేతలు సునీల్ జాఖర్ మరియు రవనీత్ సింగ్ బిట్టు.. ఇప్పుడు ఆయన తమ పార్టీలోకి రావడంతో స్వరం మార్చారు. ఆప్ అనే మునిగిపోతున్న నౌకను వారు సరైన సమయంలో వీడారని జాఖర్ స్వాగతించారు. కాగా, రవనీత్ బిట్టు గతంలో చద్దా ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేయడాన్ని ఎగతాళి చేసినప్పటికీ, ఇప్పుడు ఆప్ ప్రభుత్వంపై కలిసి పోరాడుతామని చెబుతున్నారు.
‘అవుట్ సైడర్’ ముద్ర: పంజాబ్ ప్రాంతానికి చెందని వారు (ఢిల్లీకి చెందిన చద్దా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సందీప్ పాఠక్) పంజాబ్ అధికారాలను చెలాయించడంపై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. 2022లో పంజాబ్ నుండి రాజ్యసభకు పంపిన ఏడుగురిలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఇప్పుడు సొంత పార్టీ నేతలే గళం విప్పుతున్నారు.
చద్దా వివరణ: అయితే ముఖ్యమంత్రి మాన్ చేసిన విమర్శలపై రాఘవ్ చద్దా ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ తన విలువలను, నైతికతను కోల్పోయిందని, వారి ‘పాపాల్లో’ భాగస్వామిని కావడం ఇష్టం లేకనే పార్టీని వీడానని ఆయన పేర్కొన్నారు. వచ్చే పది నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీజేపీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
