ఆర్మేనియాలో గత నవంబర్ 13న ప్రసారమైన ఓ టెలివిజన్ లైవ్ కార్యక్రమంలో, జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య అకస్మాత్తుగా ఘర్షణ చెలరేగడంతో స్టూడియో అంతా రణరంగంగా మారింది. జర్నలిస్ట్ బోరిస్ మురాజీ, రాజకీయ విశ్లేషకుడు హరుత్యూన్ మ్కర్ట్‌చ్యాన్ పాల్గొన్న ఈ చర్చ ప్రారంభంలో సాధారణంగానే సాగినప్పటికీ, ఒక దశలో అదుపుతప్పింది.
ఆర్మేనియా మాజీ అధ్యక్షుడు సెర్జ్ సర్గ్‌స్యాన్‌తో జర్నలిస్ట్ బోరిస్ మురాజీకి ఉన్నట్లు చెబుతున్న వ్యక్తిగత సంబంధంపై రాజకీయ విశ్లేషకుడు హరుత్యూన్ మ్కర్ట్‌చ్యాన్ ప్రశ్నించడమే ఈ ఘర్షణకు దారితీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మురాజీ, అది తనను అవమానించడమేనని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాడివేడిగా మాటల యుద్ధం మొదలై, ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకునే స్థాయికి చేరింది.
మాటల యుద్ధం ముదరడంతో ప్రశ్నలు, సమాధానాలను పక్కనపెట్టి ఇద్దరూ ముఖాముఖి దాడికి దిగారు. కాలర్లు పట్టుకుని నేలపైకి తోసేసుకోవడమే కాకుండా, లైవ్ కెమెరా ముందే ఒకరినొకరు పిడిగుద్దులతో, కాళ్లతో తన్నుకుంటూ విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. దీనిని ఏమాత్రం ఊహించని కార్యక్రమ వ్యాఖ్యాతలు, స్టూడియో సిబ్బంది పరుగున వచ్చి, ఎంతో శ్రమించి ఇద్దరినీ విడదీసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఘటన జరిగిన మరుసటి రోజు ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన జర్నలిస్ట్ బోరిస్ మురాజీ, మ్కర్ట్‌చ్యాన్ అన్ని హద్దులు మీరి మాట్లాడినందుకే అతనికి తగిన గుణపాఠం చెప్పాల్సి వచ్చిందని తన దాడిని సమర్థించుకున్నారు. అంతేకాకుండా, మ్కర్ట్‌చ్యాన్ తండ్రి చేయాల్సిన పనిని తాను చేశానని మురాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత వివాదాన్ని రాజేశాయి.
లైవ్ చర్చలో జరిగిన ఈ ఘర్షణపై ఆర్మేనియా టెలివిజన్ అండ్ రేడియో కమిషన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. చర్చకు ఆహ్వానించిన అతిథుల ఇలాంటి హింసాత్మక, అమర్యాదకర ప్రవర్తనను ఏ పరిస్థితుల్లోనూ సమర్థించలేమని కమిషన్ స్పష్టం చేసింది. కాగా, స్టూడియోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Leave a Reply