ఒడిశా రాష్ట్రం కియోంఝర్ జిల్లాలో లక్ష్మీ పూజ సందర్భంగా మూసి ఉన్న గదిలో ఆన్ చేసిన జనరేటర్ నుంచి వెలువడిన విషపు పొగ పీల్చి ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.
బాన్స్పాల్ పరిధిలోని సుదుంగా గ్రామంలో మంగళవారం రాత్రి ఐదుగురు యువకులు ఒకే గదిలో నిద్రపోతున్నారు. ఆ సమయంలో అదే గదిలో వారు జనరేటర్‌ను కూడా ఆన్ చేసి ఉంచారు.
రాత్రంతా ఆ జనరేటర్ నడవడంతో గది అంతా ప్రమాదకరమైన విషవాయువు (కార్బన్ మోనాక్సైడ్) వ్యాపించింది. దీంతో అక్కడున్న వారందరికీ ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు.
బుధవారం ఉదయం ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు లోపలికి వెళ్లి చూడగా.. అందరూ అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
అయితే మార్గమధ్యంలోనే ఇద్దరు మృతి చెందగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో ముగ్గురు యువకులకు అత్యవసర విభాగంలో ముమ్మర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
