ప్రస్తుతం ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీ లేకుండా ఉండటం కష్టంగా మారింది. వేసవిలో కాస్త ఉక్కపోతగా ఉన్నా నిద్ర పట్టడం కష్టమవుతుంది, అందుకే చాలా మంది రాత్రంతా ఏసీ ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల మీ గది చల్లగా మారుతుంది కానీ, అదే సమయంలో కరెంట్ బిల్లు కూడా భారీగా పెరుగుతుంది. మీ గది చల్లగా ఉండాలి, అదే సమయంలో కరెంట్ బిల్లు భారమవ్వకూడదు అని మీరు అనుకుంటే.. మీ ఏసీలోని ‘స్లీప్ మోడ్’ (Sleep Mode) చాలా ఉపయోగపడుతుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఏసీలో ‘స్లీప్ మోడ్’ అంటే ఏమిటి?
స్లీప్ మోడ్ అనేది ఏసీలోని ఒక అద్భుతమైన ఫీచర్. నేటి కాలంలోని దాదాపు అన్ని మోడరన్ ఏసీల్లో ఈ సౌకర్యం ఉంటోంది. అయితే, ఒక్కో కంపెనీ మోడల్‌లో ఇది ఒక్కో రకంగా పనిచేస్తుంది. కొన్ని ఏసీల్లో స్లీప్ మోడ్ కేవలం టైమర్‌లా పనిచేసి, ఏసీని ఆటోమేటిక్‌గా ఆఫ్ చేస్తుంది. కానీ అధునాతన మోడళ్లలో, ఈ ఫీచర్ గది ఉష్ణోగ్రతను క్రమంగా పెంచుతుంది, తద్వారా రాత్రి వేళ గది మరీ ఎక్కువగా చల్లబడకుండా చూస్తుంది.
దీని అర్థం ఏమిటంటే.. మీరు పడుకునేటప్పుడు ఏసీని తక్కువ ఉష్ణోగ్రత (ఉదాహరణకు 20°C) వద్ద ఉంచినా, స్లీప్ మోడ్ ఆన్ చేయగానే అది గంట గంటకూ ఉష్ణోగ్రతను కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతుంది. ఇది గదిలో విపరీతమైన చలిని తగ్గించి, హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
స్లీప్ మోడ్‌లో శబ్దం వస్తుందా?
స్లీప్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ స్పీడ్ తగ్గుతుంది. దీనివల్ల ఏసీ నుంచి వచ్చే శబ్దం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరికొన్ని మోడళ్లలో స్లీప్ మోడ్ టైమర్‌ను సెట్ చేసుకుంటే, నిర్దేశిత సమయం తర్వాత ఏసీ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
ఇది కరెంట్ బిల్లును ఎలా తగ్గిస్తుంది?
స్లీప్ మోడ్ కేవలం హాయిని ఇవ్వడమే కాకుండా, విద్యుత్ ఆదా చేయడానికి కూడా తోడ్పడుతుంది. సాధారణ కూలింగ్ మోడ్‌లో, ఏసీ రాత్రంతా ఒకే స్థిరమైన ఉష్ణోగ్రతను మెంటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది, దీనివల్ల కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేసి విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
అదే స్లీప్ మోడ్‌లో అయితే, ఏసీ క్రమంగా కూలింగ్‌ను తగ్గిస్తూ, ఫ్యాన్ స్పీడ్‌ను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల ఏసీపై భారం తగ్గి, కరెంట్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. వేసవి కాలంలో రాత్రంతా ఏసీ వాడేవారికి, సౌకర్యం మరియు పొదుపు పరంగా స్లీప్ మోడ్ ఒక గొప్ప వరం.
