కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు రాత్రింబవళ్లు అదనపు సమయం పనిచేస్తున్న విషయాన్ని పట్టించుకోకుండా, కేవలం 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు హెచ్ఆర్ విభాగం వివరణ కోరుతూ ఒత్తిడి చేసిన ఘటన.. ప్రస్తుత ఉద్యోగ వాతావరణంలోని మరో కఠినమైన కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
ఒక ఉద్యోగి సంస్థ అభివృద్ధి కోసం ఎలాంటి అదనపు ప్రయోజనాలను ఆశించకుండా ఎన్నో గంటలు అదనంగా పనిచేసినప్పటికీ, అతను కేవలం 15 నిమిషాలు ఆలస్యంగా రావడాన్ని మాత్రం పెద్ద తప్పుగా పరిగణిస్తూ హెచ్ఆర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆ ఉద్యోగి.. “సంస్థలో నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా?” అంటూ సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
సంస్థ లక్ష్యాలను, పనులను పూర్తి చేసేందుకు ప్రతిరోజూ ఎన్నో గంటలు కష్టపడే ఉద్యోగుల శ్రమను యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా తీసుకుంటున్నాయో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది.
ఉద్యోగులు అదనపు సమయం పనిచేసినప్పుడు వారిని ప్రశంసించేందుకు ముందుకు రాని కొన్ని హెచ్ఆర్ వ్యవస్థలు.. కేవలం కొన్ని నిమిషాల ఆలస్యాన్ని కూడా సహించకుండా వెంటనే చర్యలకు సిద్ధపడటం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సంస్థలు ఉద్యోగుల నుంచి ఎంత సౌలభ్యాన్ని, అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఆశిస్తున్నాయో.. అదే సౌలభ్యం, అర్థం చేసుకునే విధానాన్ని ఉద్యోగుల పట్ల చూపించకపోవడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఉద్యోగ ప్రదేశాల్లో కొనసాగుతున్న ‘విష సంస్కృతి’ (Toxic Work Culture) పై చర్చ మరింత తీవ్రమైంది.
పని వేళలు ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులతో అదనపు పని చేయించే సంస్థలు.. ఉద్యోగుల పరిస్థితులను, వారి వ్యక్తిగత అవసరాలను కూడా మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
అంతేకాకుండా, సంస్థలు ఉద్యోగుల పట్ల ఇలాంటి కఠినమైన, మానవత్వం లేని వైఖరిని అవలంబిస్తే.. ప్రతిభావంతులైన ఉద్యోగుల ఆత్మవిశ్వాసం, పని పట్ల ఆసక్తి దెబ్బతినడమే కాకుండా, చివరకు వారు సంస్థను వీడే పరిస్థితి కూడా ఏర్పడుతుందని మేనేజ్మెంట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply