వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనలను ప్రభుత్వం అనూహ్యంగా మార్చింది. మధ్యప్రాచ్య దేశాలలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా, సిలిండర్ రీ-బుకింగ్ కోసం వేచి ఉండాల్సిన సమయాన్ని (Waiting Period) 25 రోజులకు పెంచారు.
మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా గ్యాస్ నిల్వలను అక్రమంగా దాచకుండా చూడటానికి మరియు అందరికీ సమానంగా గ్యాస్ అందేలా చూడటానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిన్నటి వరకు 15 రోజులుగా ఉన్న ఈ వెయిటింగ్ పీరియడ్ను రాత్రికి రాత్రే 21 రోజులకు, ఆపై 25 రోజులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పిటిఐ (PTI) వార్తా సంస్థ తెలిపింది.
సరఫరాలో అంతరాయం: భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడి ఉంది. ఇరాన్ ‘హార్ముజ్ జలసంధి’ని మూసివేయడం వల్ల చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి.
130 డాలర్ల నిబంధన: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ 130 డాలర్లు దాటనంత వరకు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది 100 డాలర్ల వద్ద ఉంది.
ప్రభుత్వ వివరణ: పెట్రోలియం శాఖ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. దేశీయ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రిఫైనరీలలో ఎల్పిజి (LPG) ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ కాకుండా ఉండేందుకే రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య గ్యాప్ను 25 రోజులకు పెంచారు.
హోటళ్లకు గ్యాస్ అందుతుందా?: ప్రస్తుతం గృహ వినియోగదారులకు, ఆసుపత్రులకు మరియు విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు పరిశ్రమలకు గ్యాస్ సరఫరాను పర్యవేక్షించడానికి ముగ్గురు డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
