ముంబై – కొల్హాపూర్ మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులో దుండగులు సిగ్నల్ వైర్లను కత్తిరించి, రైలును బలవంతంగా ఆపి ప్రయాణికుల వద్ద దోపిడీకి పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మహారాష్ట్రలోని సతారా జిల్లా సల్పా (Salpa) రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో సిగ్నల్ వైర్లు కత్తిరించబడటంతో, రైలు అకస్మాత్తుగా నిలిచిపోయింది.
రైలు ఆగిపోవడాన్ని ఆసరాగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు, నిద్రపోతున్న మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. అంతేకాకుండా, అక్కడి నుంచి పారిపోయేటప్పుడు రైలుపైకి రాళ్లు రువ్వి దాడికి కూడా పాల్పడ్డారు.
బాధితులు వెంటనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది, స్థానిక పోలీసులు.. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.
రాత్రి వేళల్లో నడిచే రైళ్లలో ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిగ్నల్‌ను ధ్వంసం చేసి దోపిడీకి పాల్పడిన ముఠా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply