చాలా మంది రాత్రి వేళల్లో దుస్తులు లేకుండా పడుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఉక్కపోత నుండి ఉపశమనం కోసం ఇలా పడుకోవడం హాయిగా అనిపిస్తుంది. కానీ, నగ్నంగా పడుకోవడం వల్ల మీ ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని మీకు తెలుసా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్ ‘డాక్టర్ ఆంథోనీ యూన్ ఎండీ’ (Dr Anthony Youn MD) షేర్ చేసిన ఒక టిక్‌టాక్ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఆయన రాత్రి వేళల్లో దుస్తులు లేకుండా పడుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరించారు.
దుస్తులు లేకుండా పడుకోవడం అపరిశుభ్రమా? డాక్టర్ ఏం చెబుతున్నారు?
డాక్టర్ ఆంథోనీ ప్రకారం.. బట్టలు లేకుండా పడుకోవడం పూర్తిగా అపరిశుభ్రతకు (Unhygienic) దారితీస్తుంది. దీనికి ఆయన చెప్పిన ప్రధాన కారణం ‘అపానవాయువు’ (ఫార్ట్ / గ్యాస్ విడుదల చేయడం).
సగటున ఒక వ్యక్తి రోజుకు 15 నుండి 25 సార్లు గ్యాస్ విడుదల చేస్తాడు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇది మరింత ఎక్కువగా జరుగుతుంది.
ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం.. మనం గ్యాస్ విడుదల చేసిన ప్రతిసారీ, దాంతో పాటు అతి సూక్ష్మ పరిమాణంలో మల పదార్థం (Fecal material) కూడా గాల్లోకి లేదా బెడ్‌పైకి విడుదలవుతుంది.
మనం దుస్తులు లేకుండా పడుకున్నప్పుడు ఈ సూక్ష్మ కణాలు నేరుగా బెడ్‌షీట్‌పై పడిపోతాయి. ఆ తర్వాత అవి మీ శరీరానికి లేదా మీ పక్కన పడుకునే భాగస్వామి శరీరానికి అంటుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల పలు రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
అందుకే డాక్టర్ ఆంథోనీ రాత్రి వేళల్లో కనీసం అండర్వేర్ అయినా ధరించి పడుకోవాలని, అలాగే బెడ్షీట్లను క్రమం తప్పకుండా ప్రతిరోజూ మార్చాలని సలహా ఇస్తున్నారు.
నెటిజన్ల మధ్య మొదలైన పెద్ద చర్చ!
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పటివరకు దీనిని 70 లక్షల (7 Million) కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ సెక్షన్లో రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఒక యూజర్ స్పందిస్తూ.. “నేను 39 ఏళ్లుగా నా బెడ్‌షీట్‌పై ఇలాగే పడుకుంటున్నాను, నేనైతే నా అలవాటు మార్చుకోను” అని రాయగా..
మరొకరు “మనం బెడ్రూమ్లో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి” అని పేర్కొన్నారు.
మహిళల ఆరోగ్య సమస్యలపై క్లారిటీ
కొంతమంది మహిళలు ఈ వీడియోపై కామెంట్ చేస్తూ.. “మా వ్యక్తిగత భాగాల (Private Parts) ఆరోగ్యం కోసం, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి అండర్వేర్ లేకుండా పడుకోవాలని మా గైనకాలజిస్ట్లు సలహా ఇస్తుంటారు కదా?” అని ప్రశ్నించారు.
దీనిపై డాక్టర్ ఆంథోనీ స్పందిస్తూ.. “ఒకవేళ మీ గైనకాలజిస్ట్ మీ ఆరోగ్య సమస్యల రీత్యా మీకు అండర్వేర్ లేకుండా పడుకోవాలని సూచిస్తే, ఖచ్చితంగా మీ డాక్టర్ సలహానే పాటించండి” అని స్పష్టతనిచ్చారు.
ఇతర నిద్ర నిపుణులు (Sleep Experts) ఏమంటున్నారు?
జూలియస్ పాట్రిక్ (చీఫ్ స్లీప్ ఫిజియాలజిస్ట్, క్రామ్వెల్ హాస్పిటల్):
“వేసవి కాలంలో నగ్నంగా పడుకోవడం వల్ల నిద్ర నాణ్యత (Sleep Quality) దెబ్బతింటుంది. దుస్తులు లేకుండా పడుకున్నప్పుడు శరీరం నుండి వచ్చే చెమట చర్మంపైనే పేరుకుపోతుంది. అదే మనం చాలా తేలికపాటి కాటన్ దుస్తులు ధరించి పడుకుంటే, అవి చర్మంపై వచ్చే చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.”
డాక్టర్ గై లెస్క్జినర్ (న్యూరాలజిస్ట్ & స్లీప్ ఫిజీషియన్):
“నగ్నంగా పడుకోవడం వల్ల మన శరీరం బెడ్‌పై ఎక్కువ వేడిని అనుభవిస్తుంది. కాబట్టి పూర్తిగా నగ్నంగా పడుకోవడానికి బదులుగా, గాలి ఆడేలా ఉండే చాలా తేలికపాటి దుస్తులను ధరించి నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.”

Leave a Reply