క్రైమ్ న్యూస్: మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ తాలూకా మల్కాపూర్ పట్టణంలో వాలెంటైన్స్ డే రోజున విద్యా రంగాన్ని తలదించుకునేలా ఒక తీవ్రమైన ఘటన వెలుగుచూసింది. 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థినికి ఆమె చదువు చెప్పే టీచరే ప్రేమ ప్రపోజల్ పెట్టడమే కాకుండా, అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కరాడ్ పట్టణ పోలీసులు నిందితుడైన టీచర్‌పై కేసు నమోదు చేశారు. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 14 ఉదయం 10:30 గంటల సమయంలో సదరు టీచర్ ఆమెను క్లాస్ బయటకు పిలిచాడు. భయంతో ఆ బాలిక తన ముగ్గురు స్నేహితురాళ్లను వెంటబెట్టుకుని వెళ్ళింది.
ఒంటరిగా ఆపి ప్రపోజ్ చేసిన టీచర్: టీచర్ మిగిలిన ముగ్గురు అమ్మాయిలను క్లాసులోకి పంపేసి, బాధితురాలిని మాత్రం అక్కడే ఆపాడు. ఆ తర్వాత, “నేను నిన్ను నాలుగు రోజుల నుండి పిలుస్తున్నాను, ఎందుకు రాలేదు? నువ్వు రాత్రి 3 గంటల వరకు వాట్సాప్‌లో ఆన్లైన్లో ఎందుకు ఉంటున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని అంటూ బాలిక చేయి పట్టుకున్నాడు. టీచర్ ప్రవర్తనతో ఆ బాలిక ఒక్కసారిగా హడలిపోయింది.
ఆమె వెంటనే చేయి విడిపించుకుని క్లాసులోకి పరుగెత్తింది. జరిగిన విషయాన్ని తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వివరించింది. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో, ఆదివారం నాడు నిందితుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
