“రానున్న 3 నెలలు తస్మాత్ జాగ్రత్త”.. భారత్‌కు 44 ఏళ్లలో ఎన్నడూ లేని పెనుతుపాను ముప్పు.. ఇస్రో షాకింగ్ హెచ్చరిక..!

2026 చివరి మూడు నెలలైన అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో భారత తీర ప్రాంతాల్లో తుపాను కార్యకలాపాలు విపరీతంగా పెరిగే అవకాశముందని వాతావరణ అంచనాలు హెచ్చరిస్తున్నాయి.

ఇస్రో (ISRO) డేటాను ఉటంకిస్తూ వెలువడిన నివేదిక ప్రకారం.. ఉత్తర హిందూ మహాసముద్ర పరిధిలో సుమారు 3 ఉష్ణమండల తుపానులు (ట్రాపికల్ సైక్లోన్లు) ఏర్పడే అవకాశముంది. సాధారణంగా వర్షాకాలం ముగిసిన తర్వాతి ఈ సమయం బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపానుల ఏర్పాటుకు అనుకూలమైనదే అయినప్పటికీ.. ఈసారి ఏర్పడబోయే తుపానుల గమనం తీరప్రాంత రాష్ట్రాల్లో తీవ్ర వాతావరణ మార్పులకు దారితీయవచ్చని తెలుస్తోంది.

ముఖ్యంగా తుపానుల మొత్తం విధ్వంసక శక్తిని కొలిచే ‘పవర్ డిసిపేషన్ ఇండెక్స్’ (PDI) ఆధారంగా.. ఇది 1982 నుంచి 2025 వరకు గడిచిన 44 ఏళ్ల సగటు తో పోలిస్తే సుమారు 83 శాతం అధికం. దీని ప్రభావంతో అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడితే గుజరాత్, మహారాష్ట్ర సహా పశ్చిమ తీర రాష్ట్రాలు.. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడితే తమిళనాడుతో పాటు తూర్పు తీర రాష్ట్రాలు ఈదురు గాలులు, కుండపోత వర్షాలు, తీవ్ర సముద్ర అలజడులను ఎదుర్కోవాల్సి రావచ్చు.

అయితే, ఇది రుతుపవన పరిస్థితుల ఆధారంగా వేసిన ముందస్తు అంచనా మాత్రమే కాబట్టి.. ఫలానా నిర్దిష్ట ప్రాంతంలో తుపాను కచ్చితంగా తీరాన్ని దాటుతుందని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము. తుపాను పూర్తిస్థాయిలో కేంద్రీకృతమైన తర్వాతే దాని కదలిక దిశ, వేగం, తీరం దాటే కచ్చితమైన ప్రాంతాన్ని అంచనా వేయడం సాధ్యమవుతుంది. కాబట్టి రాబోయే నెలల్లో భారత తీరప్రాంతాల్లో సంభవించే వాతావరణ మార్పులను విపత్తు నిర్వహణ విభాగంతో పాటు సాధారణ ప్రజలు కూడా నిశితంగా గమనించడం ఎంతో అవసరం.


Posted

in

by

Tags: