రీల్స్ పిచ్చితో 40 అడుగుల ఎత్తుకు ఎక్కిన యువకుడు!.. అదుపుతప్పి కింద పడటంతో తీవ్ర భయాందోళన.. “ఆటోపై పడటంతో ప్రాణాలతో బయటపడ్డ వైనం”.. సీసీటీవీలో రికార్డైన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.!!!

గుజరాత్‌లోని సూరత్‌లో సోషల్ మీడియా రీల్స్ కోసం వీడియో చిత్రీకరించే ప్రయత్నంలో ఓ యువకుడు సుమారు 40 అడుగుల ఎత్తున్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి పైనుంచి కిందపడి ప్రాణాలతో బయటపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

సూరత్ జిల్లా ఓల్‌పాడ్ ప్రాంతంలోని కీమ్ రైల్వే ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం జరిగింది. మోను (21) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి ఆ ఫ్లైఓవర్‌ వద్దకు వెళ్లాడు. ఇద్దరూ ఫ్లైఓవర్ పిల్లర్లపైకి ఎక్కగా, మోను ఒక పిల్లర్ నుంచి మరో పిల్లర్‌పైకి దూకేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ భయానక దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఫ్లైఓవర్ పిల్లర్ల మధ్య ఉన్న ఇనుప గ్రిల్స్ ఆధారంగా విన్యాసాలు చేయబోయి అతడు పట్టు తప్పినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి పడినప్పటికీ, అదృష్టవశాత్తూ రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఆటో రిక్షాపై పడ్డాడు. నేరుగా తారు రోడ్డుపై పడకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఆటో ధ్వంసం కావడంతో పాటు సదరు యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అంత ఎత్తు నుంచి పడినా బతికి బయటపడటంతో స్థానికంగా ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరపగా, యువకుడు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ వీడియో తీసేందుకు ప్రయత్నించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే మోను మాత్రం పోలీసులకు భిన్నమైన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకోవాలన్న ఆత్రుతలో సమయం ఆదా చేసుకునేందుకు షార్ట్‌కట్ మార్గంలో వెళ్లబోయి ప్రమాదవశాత్తూ జారిపడ్డానని తెలిపాడు. దీంతో అతడు నిజంగానే సోషల్ మీడియా రీల్స్ కోసం స్టంట్స్ చేశాడా లేక షార్ట్‌కట్ వెతుకుతూ కిందపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కొద్ది సెకన్ల వీడియోల కోసం ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడం ఎంతటి పెను ప్రమాదాలకు దారితీస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక హెచ్చరికలా నిలిచింది. ఫ్లైఓవర్లపైకి ఎక్కి ప్రమాదకర విన్యాసాలు చేయడం ప్రాణాలకే ముప్పు తెస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆటోపై పడటం వల్లే అతడు బతికాడని, నేరుగా రోడ్డుపై పడి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో లైకులు, పాపులారిటీ కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి పిచ్చి చేష్టలను యువత మానుకోవాలని నెటిజన్లు సైతం హితవు పలుకుతున్నారు.


Posted

in

by

Tags: