అమృత్సర్ వడియాన్ (Amritsar Vadiyan) దాని ఘాటైన రుచికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే, ఒక ఫ్యాక్టరీలో ఈ వడియాలను ఎంత అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారో చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆందోళన కలిగిస్తోంది.
ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి షేర్ చేసిన ఈ వీడియోలో, తుప్పు పట్టిన పాత యంత్రాల ద్వారా పిండిని కలపడం, కార్మికులు ఆ పిండి మిశ్రమంపై చెప్పులు లేకుండా నగ్న పాదాలతో నడవడం కనిపిస్తుంది.
కనీసం చేతులకు గ్లౌజులు కూడా వేసుకోకుండా, మురికి చేతులతో వడియాలు చుడుతున్న దృశ్యాలను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 26 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియో, స్థానిక ఆహార ఉత్పత్తుల నాణ్యతపై పెద్ద ప్రశ్నార్థకాన్ని లేవనెత్తింది.
ఈ వడియాలను ఎండలో ఆరబెట్టేటప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ధూళి, మురికి పడేలా బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. “రుచి పేరుతో విషాన్ని అమ్ముతున్నారు” అని, “ఇది మనుషులకే కాదు, జంతువులకు కూడా పెట్టకూడదు” అని కోపంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో, బయట వడియాలు కొనేముందు ప్రజలు వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
