ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో తన పిల్లలతో కలిసి కారులో వెళుతున్న ఓ వ్యక్తిని అడ్డగించి, కారు టైరు తన కాలు మీద ఎక్కిందంటూ ఓ దుండగుడు డబ్బులు వసూలు చేసిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది.
శుక్లా అనే వ్యక్తి తన పిల్లలతో కలిసి కారులో వెళుతుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా కారును ఆపి, వైద్య ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు.
తాను ఎలాంటి ప్రమాదం చేయలేదని శుక్లా చెబుతున్నప్పటికీ, ఆ వ్యక్తి వినకుండా వెంటనే జీపే (GPay / UPI QR Code) ద్వారా డబ్బులు పంపాలంటూ కారులోని పిల్లలు భయపడేలా దురుసుగా ప్రవర్తించాడు.
పిల్లలు తీవ్రంగా భయపడటాన్ని చూసి వేరే దారి లేక శుక్లా ఆ వ్యక్తికి రూ. 1000 ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ముంబైలో జరుగుతున్న ఈ సరికొత్త ‘ఫేక్ యాక్సిడెంట్ స్కామ్’ (నకిలీ ప్రమాదాల మోసం) గురించి ఇతరులను అప్రమత్తం చేసేందుకు ఆయన ఈ విషయాన్ని ఇంటర్నెట్లో పంచుకున్నాడు.
ఇలా ఎవరైనా నకిలీ ప్రమాదాలను సృష్టించి బెదిరింపులకు పాల్పడితే, ఎవరూ భయపడి డబ్బులు ఇవ్వొద్దని, వెంటనే ‘112’ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
