“రూ.1,000 కదా అని.. కార్డు ఇచ్చిన భారతీయ యువకుడు!” మరుక్షణం అకౌంట్ చూసి మైండ్‌బ్లాక్. రూ.75,000 మాయం! పర్యాటకుడిని టార్గెట్ చేసిన సరికొత్త మోసం.!

థాయ్‌లాండ్‌కు పర్యటనకు వెళ్లిన ఒక భారతీయ యువకుడికి.. సుమారు రూ.1,000 విలువైన హెర్బల్ (మూలికా) మందును విక్రయిస్తున్నట్లు నమ్మించి, అతని క్రెడిట్ కార్డు నుంచి రూ.75,000 కు పైగా నగదును కాజేసినట్లు ఫిర్యాదు నమోదైంది.

పట్టాయా నగరంలో జరిగిన ఈ ఘటన పర్యాటకులలో కలకలం రేపింది. మందు ధర తక్కువేనని నమ్మి కార్డు ద్వారా నగదు చెల్లించిన ఆ యువకుడు.. ఆ తర్వాత బ్యాంకు లావాదేవీల మెసేజ్ చూసుకున్నప్పుడే భారీ స్థాయిలో నగదు కట్ అయినట్లు గుర్తించాడు.

ఈ ఘటన అక్టోబర్ 28వ తేదీ రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో జరిగింది. 28 ఏళ్ల భారతీయ యువకుడు పట్టాయాలోని సెకండ్ రోడ్ ప్రాంతంలో హెర్బల్ ఉత్పత్తులు విక్రయించే ఓ దుకాణం సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక విదేశీయుడు.. జుట్టు పెరగడానికి, ఇతర ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి పనిచేసే మూలికా మందు తన వద్ద ఉందని, దాన్ని కొనుగోలు చేయాలని కోరాడు. ఆ మందు ధర కేవలం 380 థాయ్ బాట్ మాత్రమేనని, భారత కరెన్సీలో అది సుమారు రూ.1,000 ఉంటుందని నమ్మించాడు.

ఇది నిజమేనని నమ్మిన యువకుడు ఆ మందును కొనుగోలు చేయడానికి అంగీకరించి, తన క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించాడు. కానీ ఆ తర్వాత లావాదేవీ వివరాలు పరిశీలించగా.. 380 థాయ్ బాట్‌కు బదులుగా 27,600 థాయ్ బాట్‌లు కట్ అయినట్లు తేలింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.75,000 కన్నా ఎక్కువే. దీంతో కంగుతిన్న ఆ యువకుడు, వెంటనే పట్టాయా సిటీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తక్కువ ధరలో మందు కొనడానికి వెళ్తే ఇంత భారీ మొత్తం కట్ అయిందని అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఫిర్యాదు చేసిన తర్వాత, మందు విక్రేతతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి ఆ యువకుడిని సంప్రదించి.. కొనుగోలు చేసిన మందును తిరిగి ఇచ్చేస్తే డబ్బులు వాపసు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే, ఆ యువకుడు మందును తిరిగి ఇచ్చి డబ్బులు తీసుకున్నాడా లేదా అనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. పట్టాయాలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని అబద్ధాలు చెబుతూ ఎక్కువ ధరకు మందులు విక్రయిస్తున్నట్లు ఇప్పటికే పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విదేశాలకు వెళ్లే పర్యాటకులు క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు విక్రయ ధరను, కట్ అవుతున్న అమౌంట్‌ను లావాదేవీ సమయంలో సరిచూసుకోవడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *