“రూ.10,000 ఇవ్వాల్సిందే! ఇవ్వకపోతే తప్పుడు కేసు పెట్టి జైల్లో వేయిస్తాం!” క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించిన మహిళలు… కారును పోలీస్ స్టేషన్ వైపు తిప్పగానే పరార్! వైరల్ వీడియో!

మహారాష్ట్రలోని కళ్యాణ్ పరిధిలో ఒక ట్యాక్సీ డ్రైవర్‌ను ఇద్దరు మహిళలు రూ.10,000 ఇవ్వాలంటూ బెదిరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ భివాండి వైపు వెళ్తుండగా కారులో ఉన్న ఆ మహిళలు డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే వేధింపుల తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపిస్తామని బెదిరింపులకు దిగారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కారు ప్రయాణిస్తున్న సమయంలోనే ఆ మహిళలు డ్రైవర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగడం, బూతులు తిడుతూ రెచ్చిపోవడం అందులో కనిపిస్తోంది. అంతేకాకుండా వారిలో ఒకరు డ్రైవర్‌పై భౌతిక దాడికి కూడా యత్నించినట్లు ఆ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

ఈ పరిస్థితుల్లో ఏమాత్రం భయపడని ఆ డ్రైవర్, వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి కారును నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్ వైపు మళ్లించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ మహిళలు డోర్ తెరవాలంటూ గట్టిగా కేకలు వేశారు. మార్గమధ్యంలో ఒక పోలీసు వాహనం కనిపించగానే, నెమ్మదిగా వెళ్తున్న ట్యాక్సీ నుంచి దూకేసి అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఈ ఘటన తాలూకు వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతుండగా, క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *