తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి విజీ చంద్రశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టారు. తనకు రావాల్సిన రూ. 18 లక్షల పారితోషికాన్ని నటి రాధికా శరత్‌కుమార్ చెల్లించకుండా మోసం చేశారని ఆమె ఆరోపించారు.
ఏం జరిగింది? విజీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఒక ప్రముఖ టెలివిజన్ సీరియల్ నుంచి రాధికా శరత్‌కుమార్ తప్పుకున్న తర్వాత, తన పాత్రలో నటించాల్సిందిగా ఆమె కోరారని తెలిపారు. రాధిక అంటే తనకు అక్క వంటివారని, ఆమె మాట కాదనలేక ఆ సీరియల్లో నటించేందుకు అంగీకరించానని చెప్పారు. అహర్నిశలు శ్రమించి ఆ పాత్రలో నటించినప్పటికీ, అనుకోకుండా ఆ సీరియల్‌ను మధ్యలోనే నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
18 లక్షల బాకీ: ఆ సీరియల్‌కు సంబంధించి తనకు రావాల్సిన రూ. 18 లక్షల పారితోషికం ఇప్పటికీ అందలేదని విజీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. “ఇది చిన్న మొత్తం కాదు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు రాలేదు. షూటింగ్ చివరి రోజున నాకు ఈ విషయం తెలిసింది. నా సహ నటులను కూడా షూటింగ్‌కు రమ్మని చెప్పాను, కానీ తీరా అక్కడికి వెళ్లాక సీరియల్ నిలిపివేసినట్లు చెప్పారు. ఆ పరిస్థితిలో నా సహ నటుల ముఖం ఎలా చూడాలి?” అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
సినీ పరిశ్రమపై నిరాశ: “సినిమా రంగం నిజాయితీతో కూడుకున్నది కాదు. ఇక్కడ చాలామంది మంచి వారు ఉన్నప్పటికీ, కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. నన్ను చూస్తుంటే ఎవరైనా సులభంగా మోసం చేయవచ్చని నా నుదుటిపై రాసి ఉన్నట్లు అనిపిస్తుంది. ‘ఏమార్చేవారు ఉన్నంత వరకు, ఏమారే వారు ఉంటూనే ఉంటారు’. కానీ, అంతా కర్మ చూసుకుంటుందని వదిలేశాను” అని ఆమె వ్యాఖ్యానించారు.
కెరీర్ గురించి: కె. బాలచందర్ దర్శకత్వంలో తిల్లు ముల్లు చిత్రంతో పరిచయమైన విజీ చంద్రశేఖర్, ఆ తర్వాత భారతీరాజా చిత్రం ‘ కిళక్కు సీమైయిలే తో మళ్లీ బిజీ అయ్యారు. తన నటనకు తగిన గుర్తింపు, సరైన పారితోషికం దక్కడం లేదని, ఇందువల్లనే తాను చాలా సార్లు సినీ పరిశ్రమను వదిలేయాలని కూడా భావించానని ఆమె తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
