బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన భారీ వంతెన ప్రారంభోత్సవం జరిగిన కొద్ది గంటల్లోనే రాజకీయ వివాదానికి దారితీసింది. జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సంబంధించిన బ్యానర్లు, జెండాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బీహార్‌లోని వైశాలి జిల్లా రాజాపాకర్ ప్రాంతం జాఫర్పట్టిలో రూ.34 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. 9.76 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల కచ్చీ దర్గా–బిదుపూర్ వంతెనను జాతికి అంకితం చేశారు. ఈ వంతెనకు ‘నితీష్ సేతు’ అని పేరు పెట్టారు. ఉత్తర, దక్షిణ బీహార్ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
అయితే ప్రధాని మోదీ అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల్లోనే వంతెనపై ఏర్పాటు చేసిన ఎన్డీయే ప్రచార బ్యానర్లు, జెండాలు, పోస్టర్లను కొందరు స్థానికులు చించివేసినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ సమయంలో అక్కడ గుమిగూడిన కొందరు తేజస్వీ యాదవ్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చొరవతో ఉత్తర, దక్షిణ బీహార్‌ను కలిపే భారీ వంతెనను ప్రారంభిస్తే, దాన్ని జీర్ణించుకోలేని ఆర్జేడీ మద్దతుదారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు అభివృద్ధి, ప్రగతిని కోరుకుంటున్నారని, బ్యానర్లు చించివేసే రాజకీయాలను కాదని విమర్శించారు.
మరోవైపు జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. వంతెనకు నితీష్ కుమార్ పేరు పెట్టినప్పటికీ, పాట్నాకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ కంటే జేడీయూ నేతలే ప్రజలకు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు.
మొత్తంగా, భారీ అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన బీహార్ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మరింత వేడెక్కాయి.

Leave a Reply