“రూ. 4,000 పెట్రోల్ కోసం ఒక ప్రాణాన్నే పణంగా పెట్టాడా?” డబ్బులు అడగడానికి వెళ్లిన బంక్ సిబ్బందిని కారుతో 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్. కారు కిటికీకి వేలాడుతూ ప్రాణాల కోసం పోరాడిన షాకింగ్ దృశ్యం.!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని ఓ పెట్రోల్ బంక్‌లో రూ. 4,000 విలువైన పెట్రోల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండా పరారయ్యేందుకు యత్నించిన కారు డ్రైవర్, ఓ సిబ్బందిని కారుతో సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

కారు కిటికీకి వేలాడుతూ ప్రాణాల కోసం పోరాడిన ఆ సిబ్బందిని కొద్దిదూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ రోడ్డుపైకి తోసేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన పెట్రోల్ బంక్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

లక్నోలోని గోసాయిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుల్తాన్‌పూర్ రోడ్డులోని రెహ్మత్ నగర్ గ్రామంలో గల జీఎస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నవంబర్ 8వ తేదీ వేకువజామున 4.19 గంటల ప్రాంతంలో ఓ నలుపు రంగు కారు పెట్రోల్ బంక్‌లోని 5వ పాయింట్ వద్దకు వచ్చింది. ఆ కారులో ఉన్న వ్యక్తి సుమారు రూ. 4,000 పెట్రోల్ కొట్టించాడు. డబ్బులు వసూలు చేయడానికి సిబ్బంది సత్యనామ్ వెళ్లగా, డ్రైవర్ డబ్బులు ఇస్తున్నట్లుగా నటించి అతడిని ఏమార్చాడని సమాచారం.

ఆ తర్వాత, డబ్బులు తీసుకోవడానికి సత్యనామ్ స్వైపింగ్ మెషీన్‌తో డ్రైవింగ్ సీటు కిటికీ వద్దకు వెళ్లాడు. అప్పుడు వేకువజామున 4.21 గంటల సమయంలో డ్రైవర్ అకస్మాత్తుగా కారును వేగంగా పోనిచ్చాడు. దీంతో సమతుల్యత కోల్పోయిన సత్యనామ్ కారు కిటికీ పట్టుకుని వేలాడుతూ ఉండిపోయాడు. అయినా కారును ఆపకుండా డ్రైవర్ వేగంగా నడిపినట్లు చెబుతున్నారు. పెట్రోల్ బంక్ నుంచి హైవే వరకు సుమారు 500 మీటర్ల దూరం అతడిని అలాగే ఈడ్చుకెళ్లిన అనంతరం, కదులుతున్న కారులోంచి రోడ్డుపైకి తోసేసి డ్రైవర్ పరారయ్యాడు. దీనికి సంబంధించిన రెండు సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి.

ఇది గమనించిన ఇతర పెట్రోల్ బంక్ సిబ్బంది కారును వెంబడించారు. కొద్దిదూరంలో రక్తగాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న సత్యనామ్‌ను చూసి వెంటనే గోసాయిగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం పీజీఐ (PGI) ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు. ఇదిలా ఉండగా, పెట్రోల్ బంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించడానికి, హైవే మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి పరారీలో ఉన్న వారిని పట్టుకోవడానికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *