దేశభక్తి అనేది డబ్బుతోనో, సంపదతోనో కొలిచేది కాదని.. అది మనిషి రక్తంలోనూ, ఆత్మగౌరవంలోనూ కలిసి ఉండాలని నిరూపించే ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హర్యానాలో రోడ్డు పక్కన చిన్న దుకాణం నడుపుకుంటున్న ఓ సాధారణ యువకుడి వద్దకు వెళ్లిన ఓ యూట్యూబర్.. రూ. 5 వస్తువుకు రూ. 500 ఇస్తానని, దానికి బదులుగా “పాకిస్థాన్ జిందాబాద్” అని చెప్పాలని ఆశ పెట్టాడు.
దానికి ఆ యువకుడు “ఒక కోటి రూపాయలు ఇచ్చినా సరే నా దేశానికి ద్రోహం చేయను” అంటూ గట్టిగా బదులిచ్చాడు. ఆ యువకుడి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే ఈ సమాధానం లక్షలాది మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
ఢిల్లీకి చెందిన ప్రముఖ యూట్యూబర్ జైదేవ్ (జీసస్) సరోహా హర్యానాలోని ఓ చిన్న దుకాణానికి వెళ్లి ఈ సామాజిక పరీక్ష (సోஷల్ ఎక్స్పెరిమెంట్) నిర్వహించాడు. రూ. 5 విలువైన వస్తువు కొని, “రూ. 500 ఇస్తాను, పాకిస్థాన్ జిందాబాద్ అని చెప్పు” అని అడిగాడు. ఇది వినగానే ఆగ్రహానికి గురైన ఆ దుకాణదారుడు.. తన దేశానికి ఎప్పటికీ ద్రోహం చేయలేనని ఖరాఖండిగా తేల్చిచెప్పాడు.
ఆ యూట్యూబర్ మళ్లీ డబ్బు ఆశ చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. “నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినా సరే, కోటి రూపాయలు ఇచ్చినా సరే నేను అలా చెప్పను” అని ఆ యువకుడు సమాధానమిచ్చాడు. ఆ యువకుడి దేశభక్తిని చూసి ఆశ్చర్యపోయిన యూట్యూబర్, అతడిని మనస్ఫూర్తిగా అభందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో దావానలంలా వ్యాపిస్తోంది.

Leave a Reply