రూ. 5 లక్షల నుండి రూ. 1 కోటి వరకు.. మేము చనిపోతున్నాం..! వీడియో పంపి రక్తపు మడుగులో తేలిన కుటుంబ సభ్యులు.. భయంకరమైన నేపథ్యం..!!

బెంగళూరు: బెంగళూరు శివార్లలో పేరుకుపోయిన అప్పుల భారం కారణంగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి, కుమార్తె మరణించగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు శివార్లకు చెందిన ఆశా (55), ఆమె కుమార్తె వర్షిత (34) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వర్షిత సోదరుడు మోహన్ గౌడ (32), వర్షిత 11 ఏళ్ల కుమారుడు మయాంక్ ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, మోహన్ గౌడ తన తల్లి, సోదరి మరియు మేనల్లుడి గొంతు కోసి, ఆపై తాను కూడా అదే విధంగా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తేలింది.

ఈ ఘాతుకానికి పాల్పడటానికి ముందు, ఆ కుటుంబం ఒక వీడియోను రికార్డు చేసింది. “తీవ్రమైన అప్పుల భారం కారణంగానే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాము” అని అందులో పేర్కొంటూ, ఆ వీడియోను బంధువులకు పంపారు. వీడియో చూసి దిగ్భ్రాంతికి గురైన బంధువులు వెంటనే వారి ఇంటికి చేరుకున్నారు. ముందు తలుపు లోపలి నుండి గడియ పెట్టి ఉండటంతో, వెనుక తలుపు గుండా లోపలికి వెళ్లి చూడగా.. నలుగురూ రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఈ విషయంపై బెంగళూరు రూరల్ ఎస్పీ చంద్రకాంత్ మాట్లాడుతూ.. “ప్రాథమిక విచారణలో భారీ అప్పుల భారమే ఈ విషాద ఘటనకు కారణమని తెలుస్తోంది. మోహన్ గౌడ రూ. 5 లక్షల నుండి రూ. 1 కోటి వరకు చిట్టీల వ్యాపారం నడిపేవారు. అంతేకాకుండా, ఉగాది పండుగ సమయంలో మాంసం విక్రయాలు, దీపావళి సమయంలో బాణసంచా విక్రయాలకు సంబంధించిన సీజనల్ చిట్టీ పథకాలను కూడా నడిపారు. దీనికి తోడు, విలాసవంతమైన జీవనశైలి వల్ల అతనికి అప్పులు పెరిగినట్లు సమాచారం. అప్పులు తీర్చలేని స్థితిలో, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది” అని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags: