భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కలిసి మరోసారి నోట్ల రద్దు (Demonetisation) చేయబోతున్నాయా అనే ఊహాగానాలు విపరీతంగా పెరిగిపోయాయి. పదేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, ఈసారి ‘డీమోనిటైజేషన్ 2.0’ లో భాగంగా రూ. 500 నోట్లను చలామణి నుండి తొలగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా గత కొన్ని వారాలుగా, రూ. 500 నోట్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని, ఇకపై దేశంలో రూ. 100 నోటునే అతిపెద్ద కరెన్సీగా ఉంచుతారని రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం లేదా ఆర్బిఐ ఇప్పటి వరకు అలాంటి అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.
పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పందన: సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. రూ. 500 నోట్ల రద్దు వార్తలను “పూర్తిగా అబద్ధం” (FAKE) అని కొట్టిపారేసింది.
- జనవరి 18న పీఐబీ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, వైరల్ అవుతున్న సందేశంపై ఎర్రటి ‘FAKE’ ముద్ర వేసింది.
- నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం రూ. 500 నోట్లను బ్యాన్ చేస్తోందన్న వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
- కేంద్ర ప్రభుత్వం అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, పౌరులు తమ దగ్గర ఉన్న రూ. 500 నోట్లను యధావిధిగా వాడుకోవచ్చని తెలిపింది.
ప్రజలకు సూచన: ఆర్థిక విధానాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని కేవలం అధికారిక మూలాల ద్వారానే ధృవీకరించుకోవాలని పీఐబీ సూచించింది. ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని మరియు వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని కోరింది.
