భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్సన్) మరియు భారతీయ యూట్యూబర్ క్యారీమినాటి (అజయ్ నగర్)తో కలిసి ఓ ప్రత్యేకమైన బేస్‌బాల్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు.
ఈ ఛాలెంజ్‌లో విజయం సాధించిన హార్దిక్ పాండ్యాకు ఒక లక్ష అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 84 లక్షలు) బహుమతిగా లభించాయి. అయితే, తనకు వచ్చిన ఆ ప్రైజ్‌మనీ మొత్తాన్ని అనాథ పిల్లలు, వీధి కుక్కల సంరక్షణ కోసం విరాళంగా ఇచ్చి అతను అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
మిస్టర్ బీస్ట్ నిర్వహించిన ఈ ప్రత్యేక బేస్‌బాల్ పోటీలో, బ్యాట్‌తో బంతిని మైదానం బయటకు కొట్టాలనే నిబంధనతో మూడు రౌండ్లు నిర్వహించారు. మొదటి రౌండ్లో ఇద్దరూ విజయం సాధించగా, తర్వాతి రౌండ్లలో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రతిభ కనబరిచి మిస్టర్ బీస్ట్‌ను ఓడించి గెలుపొందాడు. ఈ పోటీ మధ్యలో, 2024 టీ20 వరల్డ్ కప్ విజయ సంబరాలను హార్దిక్ పాండ్యా మరోసారి చేసి చూపించడం క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇటీవల కాలికి, మడమకు తగిలిన గాయాల కారణంగా.. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్ ఆడుతున్న భారత జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. అతను ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం చిత్రీకరించిన ఈ వీడియో.. ప్రస్తుతం ఇంటర్నెట్లో విడుదలై విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం ఆటకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సంక్షేమం కోసం తన ప్రైజ్‌మనీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన హార్దిక్ పాండ్యా దానగుణాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో విశేషంగా ప్రశంసిస్తున్నారు.
యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న మిస్టర్ బీస్ట్, దీనికి ముందు క్రిస్టియానో రొనాల్డో, నోవాక్ జకోవిచ్ లాంటి ప్రపంచస్థాయి క్రీడాకారులతో కూడా ఇలాంటి స్పోర్ట్స్ ఛాలెంజ్‌లను నిర్వహించాడు. ఆ క్రమంలో తాజాగా హార్దిక్ పాండ్యా సాధించిన ఈ అద్భుత విజయం, అతని మంచి మనసు.. క్రికెట్ అభిమానులను, నెటిజన్లను ఏకకాలంలో విశేషంగా ఆకట్టుకున్నాయి.

Leave a Reply