తండ్రీకొడుకులు కలిసి ఒకే రోజులో మూడు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
బ్రిటన్‌కు చెందిన స్టంట్ డ్రైవర్ అలస్టేర్ మోఫాట్, ఆయన 11 ఏళ్ల కుమారుడు విలియం మోఫాట్ 2026 ప్రపంచ రికార్డుల దినోత్సవాన్ని (Guinness World Records Day) పురస్కరించుకుని లండన్‌లో ఈ విన్యాసాలు చేశారు. రెండు చక్రాలపై కారు నడపడం మొదలుకుని, అతి తక్కువ ఖాళీలో రెండు కార్లను పార్క్ చేయడం వరకు వీరి ప్రదర్శనలు చూపరులను కట్టిపడేశాయి.
మొదట, అలస్టేర్ తన మినీ కూపర్ కారును రెండు చక్రాలపై బ్యాలెన్స్ చేస్తూ నడుపుతూ, రెండు కార్ల మధ్య ఉన్న కేవలం 6.53 మీటర్ల ఇరుకైన స్థలంలో ప్యారలల్ పార్కింగ్ చేశారు. అనంతరం కారును తిరిగి నాలుగు చక్రాలపైకి దించి ఈ విన్యాసాన్ని పూర్తి చేశారు. ఇప్పటికే తొమ్మిది సార్లు ప్రపంచ రికార్డులు సాధించిన అలస్టేర్, ఈసారి తనకున్న రెండు ప్రత్యేక నైపుణ్యాలను జోడించి ఈ కొత్త రికార్డు ప్రయత్నం చేశారు.
తండ్రికి ఏమాత్రం తీసిపోని విధంగా 11 ఏళ్ల విలియం కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ‘డ్రిఫ్ట్ కార్ట్’ (Drift Kart) అని పిలువబడే చిన్నపాటి వాహనంలో ఆగకుండా వరుసగా 10 సార్లు వృత్తాకారంలో తిరిగే విన్యాసాన్ని కేవలం 17.14 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా ఈ విన్యాసాన్ని అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేసిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. తన తండ్రి నుంచే స్ఫూర్తి పొందానని చెప్పిన విలియం, భవిష్యత్తులో తండ్రి రికార్డులన్నింటినీ అధిగమించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
ఆ తర్వాత, ఇద్దరూ కలిసి ఒకేసారి రెండు కార్లను అత్యంత దగ్గరగా ప్యారలల్ పార్కింగ్ చేసే విన్యాసంలో పాల్గొన్నారు. కొడుకు తెలుపు రంగు మినీ కారును, తండ్రి ఎరుపు రంగు మినీ కూపర్‌ను నడిపారు. పార్కింగ్ చేసినప్పుడు ఆ రెండు కార్ల మధ్య కేవలం 210 సెంటీమీటర్ల ఖాళీ మాత్రమే ఉంది. దీనితో తండ్రీకొడుకులు కలిసి మూడో ప్రపంచ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా, ఈ రికార్డుల కోసం ఉపయోగించిన తన మినీ కూపర్ కారును అలస్టేర్ ప్రపంచ రికార్డుల సంస్థకే విరాళంగా అందించడం విశేషం.

Leave a Reply