“న్యాయం ఆలస్యమవ్వడం అంటే న్యాయం నిరాకరించబడటమే” (Justice delayed is denied) అనే నానుడి ఉంది. కానీ కోర్టు మెట్లెక్కే కేసుల్లో చాలా వరకు దశాబ్దాల తరబడి తేలకపోవడంతో బాధితుల గోడు వర్ణనాతీతంగా మారుతోంది. పోనీ అది అలా ఉంచితే.. హంతకులకు, అత్యాచార నిందితులకు కోర్టులు పదే పదే బెయిల్ ఇస్తుండటంతో బాధితులు భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి నేటికీ ఉంది.
బెయిల్ పొంది బయట తిరిగే ఈ కరడుగట్టిన నేరస్థులు, తమపై ఫిర్యాదు చేసిన వారిని చంపడం, యాసిడ్ పోయడం లేదా ప్రాణాంతక దాడులు చేయడం వంటివి చేస్తూనే ఉన్నారు. ఒక హత్య చేసినా, ఇంకొకటి చేసినా శిక్ష ఒక్కటే కదా అన్నట్లుగా వీరి తీరు ఉంటోంది. నేరం రుజువు కాని నిందితులకు కోర్టులు సునాయాసంగా బెయిల్ మంజూరు చేయడం అతిపెద్ద విషాదంగా మిగిలిపోయింది.
రేపిస్ట్ అక్కు యాదవ్
అలాంటి ఒక ఉదంతమే రేపిస్ట్ అక్కు యాదవ్ బర్బర హత్య. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 2004లో జరిగిన ఈ ఘటన నేటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ కిరాతకుడు మురికివాడకు చెందిన ఒక యువతిని రేప్ చేసి చంపేశాడు. దాదాపు 10 ఏళ్లుగా కోర్టులో విచారణ జరుగుతున్న ప్రతిసారీ అతనికి సులభంగా బెయిల్ లభించేది! అంతకుముందు కూడా ఆ యువతి అత్యాచారానికి గురైనప్పుడు వారి కుటుంబ సభ్యులు కేసు పెట్టడానికి వెళ్తే, పోలీసులు నవ్వి వారిని నిందించి పంపించేశారు. దీనివల్ల అక్కు యాదవ్ మరియు అతని గ్యాంగ్ ఆగడాలు మితిమీరిపోయాయి. అక్కడ ఉన్న మహిళలను వేధించడం, బెదిరించి డబ్బు వసూలు చేయడం, యువతులను మానభంగం చేయడం వారికి నిత్యకృత్యంగా మారింది. చిన్నపిల్లలను కూడా ఆ కాముకుడు వదల్లేదు. ఎవరైనా ఎదురుతిరిగితే చంపి, శవాలను రైలు పట్టాలపై పడేసేవాడు. ప్రజల ఒత్తిడి పెరిగినప్పుడు పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు నాటకమాడినా, పదే పదే బెయిల్ రావడం వల్ల మళ్ళీ తన ఆగడాలు కొనసాగించేవాడు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న మహిళలు
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోక తప్పదన్న నిజాన్ని అక్కడి మహిళలు గ్రహించారు. న్యాయం కోసం వేచి చూస్తే మరిన్ని శవాలు పడతాయని, పోలీసుల రక్షణ కూడా ఆ రేపిస్ట్కే ఉందని తెలుసుకున్న మహిళలు గట్టిగా నిలబడ్డారు. ఒక కేసు విచారణ కోసం అక్కు యాదవ్‌ను పోలీసులు కోర్టుకు తీసుకువచ్చే సమయానికి దాదాపు 200 మంది మహిళలు సిద్ధమయ్యారు. ఆగస్టు 13, 2004న మధ్యాహ్నం 3 గంటల సమయంలో, ఆ మహిళల సమూహం అతని ముఖంపై కారం పొడి చల్లి, రాళ్లతో దాడి చేశారు. పోలీసుల నియంత్రణ దాటిపోవడంతో వారు పరుగులు తీశారు. ఆగ్రహంతో ఉన్న మహిళలు అతని గుప్తంగాలను కోసివేసి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. దశాబ్దాల కాలం నాటి ఆ వేదనను 15 నిమిషాల్లో తీర్చుకున్నారు.
మహిళల పక్షాన నిలిచిన జనం
అతన్ని చంపేసిన తర్వాత ఆ మహిళలు పోలీసుల వద్దకు వెళ్లి.. “మేమే హత్య చేశాం, మమ్మల్ని అరెస్టు చేయండి” అని చెప్పినప్పుడు పోలీసులు భయంతో వణికిపోయారు. అక్కు మరణం తర్వాత, ప్రజలందరూ ఏకగ్రీవంగా మహిళల పక్షాన నిలిచారు. న్యాయవాదులు సైతం ఆ మహిళలను నిందితులుగా చేయకూడదని గళమెత్తారు. అనంతరం కోర్టు కూడా కేసు తీవ్రతను గుర్తించి, ఏళ్ల తర్వాత తీర్పునిస్తూ అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.
