గ్వాలియర్‌లో మయన్మార్‌కు చెందిన నలుగురు యువతులను (వారిలో ఇద్దరు మైనర్లు) పోలీసులు రక్షించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
బంగ్లాదేశ్‌లోని కుతుపాలాంగ్ శరణార్థుల శిబిరం నుంచి.. పెళ్లి చేస్తామని నమ్మించి వారిని అక్రమంగా భారత్‌లోకి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముబీన్ (25), మహ్మద్ హసన్ (35) అనే ఇద్దరిని అరెస్టు చేశారు. పెళ్లిళ్ల పేరుతో యువతులను వేరే ప్రాంతాలకు తరలించేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. దీని వెనుక ఏదైనా పెద్ద మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) నెట్వర్క్ పనిచేస్తోందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించి భోపాల్ రైల్వే పోలీసు కంట్రోల్ రూమ్‌కు అందిన సమాచారం మేరకు.. 12643 స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైలులోని జనరల్ బోగీలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ముబీన్ అనే వ్యక్తిని గ్వాలియర్ రైల్వే పోలీసులు పట్టుకుని విచారించారు. విచారణలో.. తనకు సంబంధించిన మహ్మద్ హసన్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఒక అద్దె ఇంట్లో కొందరు యువతులతో కలిసి ఉంటున్నట్లు అతను చెప్పాడని సమాచారం. దీంతో పోలీసులు అలీగఢ్‌లోని ఆ ఇంటికి వెళ్లి సోదాలు చేసి నలుగురు మయన్మార్ యువతులను రక్షించారు.
రక్షించబడిన యువతులకు రోహింగ్యా భాషతో పాటు అక్కడి స్థానిక భాష తెలుసని పోలీసులు తెలిపారు. వారిని విచారించే క్రమంలో భాషా సమస్య తలెత్తడంతో గూగుల్ అనువాద (Google Translate) సదుపాయంతో పాటు రెండు భాషలు తెలిసిన ఒక వ్యక్తి సహాయాన్ని కూడా పోలీసులు తీసుకున్నారు. తమ తల్లిదండ్రుల అంగీకారంతోనే భారత్‌లోకి వచ్చామని.. నదులు, కొండల మీదుగా అక్రమ మార్గంలో భారత్‌లోకి ప్రవేశించామని ఆ యువతులు పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. భారత్‌లోకి వచ్చిన తర్వాత తమకు పెళ్లి చేస్తామని వారు చెప్పినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ యువతులను జమ్మూ, శ్రీనగర్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి పెళ్లి చేయాలని నిందితులు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శరణార్థుల శిబిరాల్లో నివసిస్తున్న యువతులను పెళ్లి పేరుతో భారత్‌లోకి తీసుకొస్తున్న మానవ అక్రమ రవాణా ముఠా ఏదైనా పనిచేస్తోందా అన్న కోణంలో విచారణ ముమ్మరం చేశారు. రక్షించబడిన ఇద్దరు మైనర్ బాలికలను సురక్షిత సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా, ఇలాగే మరెవరినైనా భారత్‌లోకి తీసుకొచ్చారా అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply