రైలులో టికెట్ లేకుండా ఎక్కారా? కంగారు పడకండి, ప్రయాణికులు తెలుసుకోవలసిన హక్కులు ఇవే!

రైలు దొరకదనే తొందరలోనో లేదా ఆన్‌లైన్ బుకింగ్‌లో సాంకేతిక సమస్యల వల్లో అప్పుడప్పుడు టికెట్ లేకుండా రైలు ఎక్కాల్సి రావచ్చు. అటువంటి సమయంలో టిటిఈ (TTE) కనిపిస్తే చాలు చాలామంది భయపడిపోతుంటారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైల్వే చట్టాలు ప్రయాణికులకు కొన్ని హక్కులను కల్పిస్తున్నాయని మీకు తెలుసా?

టికెట్ లేని ప్రయాణికులను నేరస్తుల్లా చూసే అధికారం టిటిఈకి లేదు. ప్రయాణికుడి నుండి అసలు ప్రయాణ ఛార్జీతో పాటు నిర్ణీత జరిమానా (Penalty) వసూలు చేసి, వారు ప్రయాణాన్ని కొనసాగించడానికి అనుమతించేలా టిటిఈ రశీదు ఇవ్వాలి. డబ్బులు తీసుకున్నప్పుడు దానికి ఖచ్చితమైన అధికారిక రశీదు (Receipt) ఇవ్వడం తప్పనిసరి. రశీదు లేకుండా డబ్బులు వసూలు చేసే హక్కు ఏ అధికారికి లేదు.

టిటిఈ ప్రవర్తన మరియు నిబంధనలు: రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణికులను బెదిరించడం లేదా వారితో అసభ్యంగా ప్రవర్తించడం టిటిఈ చేయకూడదు. నిబంధనలను వివరించి గౌరవంగా ప్రవర్తించడం వారి బాధ్యత. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు రోగుల పట్ల చాలా మృదువుగా వ్యవహరించాలని చట్టం చెబుతోంది.

వెయిటింగ్ లిస్ట్ టికెట్ల నిబంధన: మీ దగ్గర వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉండి, స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో సీటు అందుబాటులో లేకపోతే.. మిమ్మల్ని జనరల్ కోచ్‌లోకి వెళ్ళమని టిటిఈ కోరవచ్చు. అయితే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణికులను రైలు నుండి అకస్మాత్తుగా దించేయడం సాధ్యం కాదు.

ఫిర్యాదు చేయడం ఎలా? ఒకవేళ టిటిఈ మీతో దురుసుగా ప్రవర్తించినా లేదా లంచం అడిగినా మీరు ఈ క్రింది మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చు:

  • 139 రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు.
  • ‘రైల్ మదద్’ (Rail Madad) యాప్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు రైలు నంబర్, కోచ్ నంబర్ మరియు ఘటన వివరాలను స్పష్టంగా తెలపాలి.

Posted

in

by

Tags: