ముంబై: మెడికల్ చదువుతున్న ఒక విద్యార్థి దురదృష్టవశాత్తూ తన సర్వస్వాన్ని కోల్పోయి, అనాథగా మారి చివరకు భిక్షాటన స్థాయికి పడిపోయిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. పోలీసుల సకాలంలో స్పందనతో అతను తిరిగి తన కుటుంబాన్ని చేరుకోగలిగాడు.
ఏం జరిగింది? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ముంబైలోని మాలాడ్ ప్రాంతంలో ఎస్వీ రోడ్‌పై ఉన్న భిక్షాటన చేసే వారిని పునరావాసం కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో కానిస్టేబుల్ కోమల్‌సింగ్ జాదవ్‌కు సుమారు 20 ఏళ్ల యువకుడు అత్యంత దయనీయ స్థితిలో కనిపించాడు. అతను సరిగ్గా సమాధానం చెప్పలేని స్థితిలో ఉండటంతో, పోలీసులు అతడిని మాలాడ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అసలు నిజం: పోలీసులు ఆ యువకుడికి స్నానం చేయించి, కొత్త బట్టలు పెట్టి, భోజనం అందించారు. కోలుకున్న తర్వాత సబ్-ఇన్స్పెక్టర్ మనీషా కాగల్కర్ అతడిని ఆరా తీయగా, తన పేరు అభయ్ అని, నాందేడ్ జిల్లాలోని తంసా ప్రాంతానికి చెందినవాడినని, అక్కడ హోమియోపతి మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నానని చెప్పాడు. కొన్ని నెలల క్రితం రైలులో ముంబై వస్తుండగా తన బ్యాగ్ దొంగిలించబడిందని, అందులో డబ్బుతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు ఉన్న కాగితం కూడా ఉండటంతో వారితో సంబంధాలు తెగిపోయాయని అభయ్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇప్పటికే ఉన్న మానసిక సమస్య తోడవడంతో, పరిస్థితి విషమించి అభయ్ భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కుటుంబంతో కలయిక: వెంటనే స్పందించిన ఎస్ఐ మనీషా, తంసా పోలీసులను సంప్రదించారు. అభయ్ మిస్సింగ్ కేసు అప్పటికే నమోదై ఉందని వారు ధృవీకరించారు. పోలీసులు పంపిన అభయ్ ఫోటోలను చూసి గుర్తుపట్టిన కుటుంబ సభ్యులు, అదే రోజు రాత్రి ముంబై చేరుకున్నారు. మాలాడ్ పోలీస్ స్టేషన్లో కుటుంబం మరియు అభయ్ కలుసుకున్న దృశ్యం అత్యంత భావోద్వేగంగా సాగింది.
