న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో ప్రయాణం అంటేనే ఒక విభిన్న అనుభవం. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. రైలు బోగీలోనే ప్రయాణికులు భక్తి గీతాలు ఆలపిస్తూ, హారతులు ఇస్తూ పూజలు నిర్వహించడం ఇప్పుడు ‘పబ్లిక్ కండక్ట్’ (ప్రజా ప్రవర్తన)పై పెను వివాదాన్ని రేపుతోంది.
రైలు బోగీ.. దేవాలయంలా మార్పు!
వైరల్ అవుతున్న వీడియోలో ఒక రైలు కోచ్‌ను ప్రయాణికులు అందంగా అలంకరించారు. రైలులోని ఒక అప్పర్ బెర్త్‌ను ఏకంగా ఒక చిన్న గుడిగా మార్చేశారు. అక్కడ దేవుళ్ల చిత్రపటాలను ఉంచి, పూలతో అలంకరించి, ప్రయాణికులందరూ చుట్టూ చేరి భజనలు చేస్తూ హారతి ఇస్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.
“వార్ని ఇంకా జైల్లో ఎందుకు వేయలేదు?”
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. “పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి పనులకు అనుమతి ఎలా ఇస్తారు? భద్రత మాటేమిటి?” అని ప్రశ్నిస్తున్నారు.
- “ముస్లింలు నమాజ్ చేస్తే తప్పని అనేవారు.. ఇప్పుడు దీనిపై ఏమంటారు?” అని ఒకరు ప్రశ్నించగా..
- “ఇలాంటి వారిని ఇంకా జైల్లో ఎందుకు వేయలేదు? కేవలం రీల్స్ కోసమే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారా?” అని మరొకరు విమర్శించారు.
- “దేవుడు అంతటా ఉంటాడు.. అలాగని రైల్వే వాష్‌రూమ్‌లలో కూడా ఇలాగే చేస్తారా?” అంటూ మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ట్విస్ట్ ఏంటంటే.. అది ‘భారత్ గౌరవ్’ రైలు!
అయితే, ఈ విమర్శల మధ్య అసలు విషయం బయటపడింది. ప్రయాణికులు పూజలు చేస్తున్న ఆ రైలు సాధారణ రైలు కాదు.. అది ఒక ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు. ఆధ్యాత్మిక యాత్రల కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా నడిపే ఈ రైళ్లలో ఇలాంటి భక్తి కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని కొందరు వివరణ ఇస్తున్నారు. ఇది యాత్రికుల కోసం కేటాయించిన ప్రత్యేక కోచ్ అని, సిబ్బంది సహకారంతోనే ఈ అలంకరణ జరిగిందని వారు చెబుతున్నారు.
రంగంలోకి దిగిన ఎన్.సి.ఐ.బి (NCIB):
ఈ వివాదం ముదరడంతో నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) అధికారికంగా స్పందించింది. ప్రయాణ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో క్రమశిక్షణ పాటించాలని, నిబంధనలు అతిక్రమించవద్దని ప్రయాణికులను కోరింది.
సంస్కృతిని గౌరవించాలా? లేక పౌర బాధ్యతను పాటించాలా? అనే విషయంలో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. సందర్భం ఏదైనా, ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
