రైలు 5 గంటలు లేట్‌గా వస్తే నేనెందుకు ఫైన్ కట్టాలి..? “₹10 టికెట్‌కు.. ₹500 అడిగిన టీటీఈ”! రైల్వే స్టేషన్‌లో నిలదీసిన యువకుడు.. నెటిజన్ల ఫుల్ సపోర్ట్!

ముంబై: భారతీయ రైల్వేల వైఫల్యం వల్ల రైళ్లు ఆలస్యంగా వస్తే.. ఆ తప్పుకు సామాన్య ప్రయాణికులు భారీగా జరిమానాలు కట్టాలా? అంటూ ఒక యువకుడు రైల్వే స్టేషన్‌లో టీటీఈని (TTE) నిలదీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబై పరిధిలోని కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

సదరు యువకుడు తన బంధువును రైలు ఎక్కించడానికి కల్యాణ్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఆ సమయంలో రైలు రావడానికి మరో 2 గంటల సమయం పడుతుందని తెలియడంతో, ఆయన నిబంధనల ప్రకారం ₹10 రూపాయలు పెట్టి ప్లాట్‌ఫారమ్ టికెట్ కొనుగోలు చేశాడు.

5 గంటల ఆలస్యం – ₹500 జరిమానా: అయితే, ఆ రైలు ప్రకటించిన సమయం కంటే ఏకంగా 5 గంటలు ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకుంది. దీంతో చేసేదేమీ లేక అంతసేపు ప్లాట్‌ఫారమ్‌పైనే వేచి ఉండి, చివరకు తన బంధువును రైలు ఎక్కించి తిరిగి వస్తుండగా.. అక్కడ ఉన్న టికెట్ కలెక్టర్ (TTE) ఆ యువకుడిని అడ్డుకున్నాడు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఒక ప్లాట్‌ఫారమ్ టికెట్ కాలపరిమితి కేవలం 2 గంటలు మాత్రమేనని, ఆయన 2 గంటల కంటే ఎక్కువ సమయం స్టేషన్‌లో ఉన్నందున వితౌట్ టికెట్ కింద లెక్కకట్టి ₹500 రూపాయల జరిమానా (ఫైన్) కట్టాలని డిమాండ్ చేశాడు.

రైల్వే స్టేషన్‌లో వాగ్వాదం – సోషల్ మీడియాలో రచ్చ: టీటీఈ మాటలకు షాకైన ఆ యువకుడు ఆయనతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. “రైలు 5 గంటలు ఆలస్యంగా రావడం అనేది రైల్వే శాఖ తప్పు. రైలు లేట్‌గా రావడం వల్లే నా టికెట్ కాలపరిమితి ముగిసిపోయింది. ఇందులో నా తప్పేముంది? రైలు ఆలస్యంగా నడిపినందుకు రైల్వే శాఖ ఏమైనా ప్రయాణికులకు నష్టపరిహారం కడుతుందా?” అంటూ ప్రశ్రల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ (X) ప్లాట్‌ఫారమ్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ప్లాట్‌ఫారమ్‌లపై రద్దీని నియంత్రించడానికి ఈ 2 గంటల నియమం అవసరమేనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నప్పటికీ.. అత్యధిక శాతం మంది నెటిజన్లు ఆ యువకుడికి మద్దతుగా నిలుస్తున్నారు. “రైళ్లు ఆలస్యంగా నడిచినప్పుడు ప్లాట్‌ఫారమ్ టికెట్ కాలపరిమితిని కూడా ఆటోమేటిక్‌గా పొడిగించేలా రైల్వే చట్టాల్లో మార్పులు చేయాలి, లేదా ప్రయాణికులకు రైల్వే శాఖే రిఫండ్ ఇవ్వాలి” అంటూ యువకుడి న్యాయమైన డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *