రైల్వే ప్రయాణికులకు గమనిక: ఇకపై మొబైల్‌లో టికెట్ చూపిస్తే సరిపోదు.. కొత్త రూల్ ఏంటంటే?

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: డిజిటల్ మోసాలను అరికట్టేందుకు భారతీయ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే కౌంటర్లు లేదా ఆటోమేటిక్ మెషీన్ల ద్వారా తీసుకున్న అన్రిజర్వ్‌డ్ (Unreserved) టికెట్ల విషయంలో కేవలం మొబైల్‌లో ఫోటో చూపిస్తే సరిపోదని, తప్పనిసరిగా ప్రింటెడ్ టికెట్ (Printed Ticket) చేతిలో ఉండాలని స్పష్టం చేసింది.

AI ద్వారా టికెట్ మోసం – అసలేం జరిగింది?

ఇటీవల జైపూర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి టికెట్లను ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది విద్యార్థులు కేవలం ఒకే ఒక టికెట్ కొనుగోలు చేసి, AI టూల్స్ సహాయంతో అందులో ఏడుగురు ప్రయాణికుల పేర్లు వచ్చేలా మార్చేశారు. క్యూఆర్ కోడ్, ప్రయాణ వివరాలు అన్నీ అచ్చం అసలు టికెట్‌లాగే ఉండటంతో మొదట ఎవరూ గుర్తించలేదు. కానీ, టికెట్ కలెక్టర్ (TC) క్షుణ్ణంగా పరిశీలించగా అది నకిలీ టికెట్ అని తేలింది. ఇలా ఒకే టికెట్‌పై ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన రైల్వే అధికారులు విస్తుపోయారు.

కొత్త నిబంధనలు ఇవే:

ఈ తరహా డిజిటల్ మోసాలను అడ్డుకోవడానికి రైల్వే ఈ క్రింది మార్పులు చేసింది:

  • కౌంటర్ టికెట్లు: మీరు యూటీఎస్ (UTS), ఏటీవీఎం (ATVM) లేదా రైల్వే కౌంటర్ల ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కొనుగోలు చేస్తే, ప్రయాణ సమయంలో తప్పనిసరిగా దాని ఒరిజినల్ ప్రింటెడ్ కాపీని వెంట ఉంచుకోవాలి.
  • మొబైల్ ఫోటోలు చెల్లవు: కౌంటర్ టికెట్‌ను ఫోటో తీసి మొబైల్ స్క్రీన్‌పై చూపిస్తే అది చెల్లుబాటు కాదు. దానిని టికెట్ లేని ప్రయాణంగానే పరిగణిస్తారు.
  • మినహాయింపు: ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఈ-టికెట్లు (E-Tickets) మరియు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసిన ఎం-టికెట్లకు (M-Tickets) ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంది. వీటిని యధావిధిగా మొబైల్‌లో చూపించవచ్చు.
తనిఖీలు కఠినతరం:

అనుమానం వస్తే టీసీలు ఇప్పుడు యూటీఎస్ నంబర్ మరియు కలర్ కోడ్‌ను స్కాన్ చేసి టికెట్ అసలైనదా కాదా అని వెంటనే నిర్ధారిస్తారు. టికెట్ బ్రోకర్ల కార్యకలాపాలపై కూడా నిఘా పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు.


Posted

in

by

Tags: