“రొమాన్స్ చేద్దామనుకుంటే ఫ్యామిలీ టూర్ తీసుకెళ్లాడు..!” హనీమూన్‌కు అత్తమామలు కూడా రావడంతో విడాకులు కోరిన భార్య.. షాక్‌లో భర్త!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత ఘటన సంచలనం సృష్టించింది. హనీమూన్ పర్యటనలో భార్య అనుమతి లేకుండా తన తల్లిదండ్రులను కూడా వెంటబెట్టుకొచ్చినందుకు, ఆగ్రహించిన భార్య విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

ఘజియాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు, అదే ప్రాంతానికి చెందిన యువతికి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. హనీమూన్ కోసం భార్యను విదేశాలకు తీసుకెళ్తానని భర్త ప్రామిస్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే దుబాయ్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేశాడు. అయితే, దుబాయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాతే తనతో పాటు అత్తమామలు కూడా హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారని తెలుసుకున్న ఆ యువతి నిర్ఘాంతపోయింది.

దీని గురించి భర్తను నిలదీయగా.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో దుబాయ్‌కి వెంట తీసుకొచ్చానని అతడు కుంటి సాకులు చెప్పాడు. ఏకాంతంగా గడపాల్సిన హనీమూన్ సమయంలో అత్తమామలతో కలిసి టూరిస్ట్ ప్లేస్‌లు తిరగాల్సి రావడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో దుబాయ్ పర్యటన ముగించుకుని ఇండియా తిరిగొచ్చిన వెంటనే, భర్త తనను మోసం చేశాడని ఆరోపిస్తూ అతడితో కాపురం చేయడానికి నిరాకరించి పుట్టింటికి వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఈ ‘హనీమూన్ పంచాయితీ’ ఫ్యామిలీ కోర్టు పరిధిలోని కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరింది. అక్కడ అధికారులు నిర్వహించిన రాజీ చర్చలు కూడా విఫలం కావడంతో, ఆ యువతి విడాకులు కోరుతూ అధికారికంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా హనీమూన్ ప్లాన్‌ను ఫ్యామిలీ టూర్‌గా మార్చిన భర్తతో కలిసి ఉండలేనని ఆమె స్పష్టం చేస్తోంది. భార్య తీసుకున్న ఈ నిర్ణయంతో భర్త ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *