ఏప్రిల్ 1, 2026 నుండి పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణలు), యాంటీబయోటిక్స్ మరియు జ్వరం తగ్గించే పలు ముఖ్యమైన మందుల ధరలు పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA), నిత్యావసర మందుల జాబితా (NLEM)లో ఉన్న 1000 కంటే ఎక్కువ మందుల ధరలను స్వల్పంగా పెంచడానికి అనుమతి ఇచ్చింది.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? టోకు ధరల సూచీ (WPI) ఆధారంగా ఈ పెంపు జరుగుతోంది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2025లో WPI గత ఏడాదితో పోలిస్తే 0.64956 శాతం పెరిగింది. దీని ఆధారంగా మందుల ధరలను సుమారు 0.6 శాతం పెంచుతున్నారు. మందుల తయారీ వ్యయం పెరగడంతో కంపెనీలకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఈ మార్పులు చేస్తుంది.
ఏయే మందులు ఖరీదవుతాయి? ఈ పెంపు వల్ల మనం రోజువారీ వాడే అనేక మందుల ధరలు పెరుగుతాయి:
- జ్వరం & నొప్పి: పారాసిటమాల్ వంటి సాధారణ మందులు.
- యాంటీబయోటిక్స్: అజిత్రోమైసిన్ (ఇన్‌ఫెక్షన్ల కోసం), సిప్రోఫ్లోక్సాసిన్.
- ఇతరాలు: రక్తహీనత (Anemia) మందులు, విటమిన్లు, మినరల్స్, స్టెరాయిడ్స్ మరియు కోవిడ్-19 చికిత్సలో వాడే కొన్ని మందులు.
- గమనిక: అధికారికంగా 0.6% పెంపు ఉన్నప్పటికీ, తయారీ వ్యయం పెరగడం వల్ల కొన్ని మందుల ధరలు (ఉదాహరణకు పారాసిటమాల్) మార్కెట్‌లో 25% వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
కారణం: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం మందుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాల (API) ధరలు అంతర్జాతీయంగా 30-35% పెరిగాయి. యుద్ధం కారణంగా గ్లిజరిన్ ధర 64% పెరగగా, ప్యాకేజింగ్ మెటీరియల్ (అల్యూమినియం ఫాయిల్ వంటివి) 40% ప్రియమయ్యాయి. దీనివల్ల లాభాల మార్జిన్ తగ్గిపోతోందని, ప్రభుత్వం ఇచ్చిన 0.6% పెంపు తమకు సరిపోదని ఫార్మా కంపెనీలు వాదిస్తున్నాయి.
వినియోగదారులపై ప్రభావం: భారతదేశంలో లక్షలాది మంది ప్రతిరోజూ ఈ మందులను వాడుతుంటారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం పడుతుంది. అయితే, ఈ పెంపు కేవలం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న (NLEM) మందులకే వర్తిస్తుంది. బ్రాండెడ్ లేదా నిత్యావసర జాబితాలో లేని మందుల ధరలు మార్కెట్ పరిస్థితుల బట్టి మారుతుంటాయి.
