“రోజుకు 3,000 బౌల్స్ నూడుల్స్.. క్యూలో నిలబడి ఎదురుచూస్తున్న ప్రజలు!” మంచి ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం చివరికి పెద్ద వివాదంగా మారిందే.. ఇంటర్నెట్‌లో కలకలం!

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న నాన్జింగ్ నగరంలో నడుస్తున్న ‘జీరో యువాన్ నూడుల్స్’ అనే రెస్టారెంట్, రోజుకు సుమారు 3,000 బౌల్స్ నూడుల్స్‌ను ఉచితంగా అందిస్తుండటం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

జియాంగ్నింగ్, యుహువాటాయ్ జిల్లాల్లోని దీని రెండు బ్రాంచీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉచితంగా వెజ్ నూడుల్స్ అందిస్తున్నారు.

పుట్టగొడుగులు (మష్రూమ్స్), సోయా ఉత్పత్తులు, కూరగాయలతో తయారు చేసిన ఈ నూడుల్స్‌ను తీసుకునేందుకు మొదట్లో పేద, ధనిక అనే తేడా గానీ, ఎలాంటి నిబంధనలు గానీ లేకపోవడంతో భారీ సంఖ్యలో ప్రజలు పొడవైన క్యూలలో నిలబడి తీసుకెళ్లేవారు.

ఆకలితో ఉన్నవారికి, తక్కువ ఆదాయం ఉన్నవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రెస్టారెంట్ యజమాని జాంగ్ తెలిపారు. దీనికి ఇంటర్నెట్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నప్పటికీ, సమీపంలోని చిన్న హోటళ్ల యజమానుల్లో తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను కలిగించింది.

ఉచిత భోజనం దొరుకుతుండటంతో తమ దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య బాగా తగ్గిపోయిందని, రోజువారీ ఆదాయం తీవ్రంగా దెబ్బతిందని కొందరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు రావడంతో స్థానిక అధికారులు జరిపిన తనిఖీల్లో, ఆ రెస్టారెంట్‌కు అవసరమైన లైసెన్సులు, పరిశుభ్రత ప్రమాణాలు అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నిర్ధారణ అయింది.

అయినప్పటికీ, చుట్టుపక్కల వ్యాపారుల జీవనోపాధికి కలిగే నష్టం, వివాదాలను దృష్టిలో ఉంచుకుని.. ఇకపై 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, పారిశుధ్య కార్మికులు, డెలివరీ బాయ్స్ వంటి అవసరమైన నిర్దిష్ట వర్గాలకు మాత్రమే ఉచిత నూడుల్స్ అందించేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు సమాచారం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *