తప్పు చేయడం మానవ సహజం. కానీ, స్వార్థం కోసం, అధికారం కోసం లేదా మరేదైనా కారణంతో తెలిసి చేసే నేరాలను సమాజం ఎప్పుడూ అంగీకరించదు. చరిత్రలో రోమన్లు తమ కాలంలో నేరస్థులకు ఇచ్చిన కొన్ని కఠినమైన శిక్షల గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. ఇవి చదవడానికి మనసును కాస్త రాయి చేసుకోవాల్సిందే!
రోమ్‌లోని అత్యంత దారుణమైన శిక్షలు:
1. పారిసైడ్ శిక్ష (PARRICIDE PUNISHMENT): కుటుంబ సభ్యులను (అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు) చంపిన వారిని రోమన్లు ‘పారిసైడ్’ అని పిలిచేవారు. వీరికి ఇచ్చే శిక్ష చాలా వింతగా, క్రూరంగా ఉంటుంది. నేరస్థుడిని ఒక పెద్ద గోనె సంచిలో పెట్టి, అందులో ఒక కోడి, పాము, కుక్క, కోతిని కూడా వేసి సంచిని గట్టిగా కట్టేసేవారు. ఆ తర్వాత ఆ సంచిని సముద్రంలోనో లేదా లోతైన బావిలోనో పడేసేవారు. లోపల ఉన్న జంతువుల దాడికి, గాయాలకు గురవుతూ, చివరకు నీటిలో ఊపిరాడక ఆ నేరస్థుడు నరకయాతన అనుభవించి మరణించేవాడు.
2. దేశద్రోహ శిక్ష (TREASON PUNISHMENT): ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టడం లేదా రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం వంటి నేరాలకు ఈ శిక్ష విధిస్తారు. నేరస్థులను ప్రజల మధ్యలో లేదా ఏకాంత గదిలో ఇనుప రాడ్లతో, రాళ్లతో కొట్టి తీవ్రంగా హింసించేవారు. కొన్నిసార్లు వీరిని క్రూర మృగాలకు ఆహారంగా పడేసేవారు. ఈ హింస భరించలేక నేరస్థుడు ప్రాణాలు విడిచేవాడు.
3. మాంత్రికులు మరియు మత ప్రచారం చేసే వారికి శిక్ష: అబద్ధాలు చెప్పేవారు, ప్రజలను తప్పుదోవ పట్టించే మాంత్రికులు మరియు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే వారిని బహిరంగంగా కొరడాలతో, రాళ్లతో కొట్టి హింసించేవారు. అలాగే, క్రైస్తవ మత ప్రచారం చేసే వారిని లేదా బలవంతంగా మత మార్పిడిలకు ప్రోత్సహించే వారిని అడవి జంతువుల బోన్లలో వేసి చంపేవారు.
4. బ్రహ్మచర్యం నియమాన్ని ఉల్లంఘిస్తే (BREAKING THE OATH OF CELIBACY): రోమ్‌లో ‘వెస్టల్ వర్జిన్స్’ అని పిలువబడే కొందరు మహిళా సన్యాసినులు పవిత్ర అగ్నిని కాపాడాల్సి ఉంటుంది. వీరు ఖచ్చితంగా 30 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించాలనే కఠిన చట్టం ఉండేది. ఒకవేళ ఆ మహిళ తన శీలాన్ని కోల్పోయిందని రుజువైతే, ఆమెను నగరానికి దూరంగా ఉన్న ఒక చీకటి గదిలో బంధించేవారు. అక్కడ ఆమెకు చాలా తక్కువ ఆహారం, ఒక చిన్న దీపం మాత్రమే ఇచ్చి వదిలేసేవారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆకలితో, భయంతో మరణించేది. ఇక ఆమెతో సంబంధం ఉన్న పురుషుడిని బహిరంగంగా కొట్టి చంపేవారు లేదా ఉరి తీసేవారు
