మహారాష్ట్రలోని పుణెలో 34 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. లండన్‌లో ఎంబీఏ చదువుతోందని తల్లిదండ్రులు భావిస్తున్న ఆమె.. వాస్తవానికి ఆగస్టు నెలలోనే భారత్‌కు తిరిగి వచ్చి, పుణెలోని ఓ అపార్ట్మెంట్లో రహస్యంగా ఉంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
పుణెకు చెందిన ముక్తా అవినాష్ దేశ్‌ముఖ్ లండన్‌లో ఎంబీఏ చదువుతున్నట్లు ఆమె తల్లిదండ్రులు భావించారు. అక్టోబర్ 23న ఆమె తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. తాను ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నానని చెప్పి హడావుడిగా కాల్ కట్ చేశారు. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.
దీంతో లండన్‌లో ఉన్న ఆమె స్నేహితురాలి సహాయంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లండన్ పోలీసులు విచారణ చేపట్టగా, ముక్తా ఆగస్టు నెలలోనే లండన్‌ను విడిచిపెట్టి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఆమె బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలించగా, ఆగస్టు నుంచే పుణెలోని లోధా సొసైటీలో ఉన్న ఓ ఫ్లాట్‌లో రహస్యంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం తల్లిదండ్రులు, పోలీసులు ఆ ఫ్లాట్ వద్దకు చేరుకున్నారు. తలుపులు లోపలి నుంచి మూసి ఉండటంతో వాటిని బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు.
అక్కడ ముక్తా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహంగా కనిపించారు. ఈ దృశ్యం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే పోస్టుమార్టం నివేదికలోనూ ఆమె మృతికి స్పష్టమైన కారణం ఇంకా వెల్లడికాలేదని సమాచారం.
ముక్తా ఆగస్టులోనే లండన్ నుంచి ఎందుకు తిరిగివచ్చారు? తల్లిదండ్రులకు తెలియకుండా పుణెలో ఎందుకు ఉంటున్నారు? అక్టోబర్ 23న చివరిసారిగా మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణానికి గల అసలు కారణం తెలియాల్సి ఉంది.
