అబుదాబి రాజకుటుంబంతో వైవాహిక సంబంధం ఉన్న 32 ఏళ్ల మహ్రా అల్ నహ్యాన్ అనే మహిళ లండన్ వీధిలో డ్రగ్స్ మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉండగా గుర్తించారు. చిన్నారి సంరక్షణను నిర్లక్ష్యం చేసినందుకు గాను ఆమెకు కోర్టు శిక్ష ఖరారు చేసింది.
ఈ ఘటన జరిగిన సమయంలో, ఆమె సంరక్షణలో ఉండాల్సిన 3 ఏళ్ల బాలుడు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, తిరుగుతున్న వాహనాల మధ్య ప్రమాదకరంగా ఒంటరిగా రోడ్డుపై నడుస్తూ కనిపించాడు. బ్రిటిష్ మీడియా కథనాల ప్రకారం, గత జూన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాను కొకైన్ తీసుకున్నట్లు ఆ మహిళ కోర్టులో అంగీకరించింది.
ఈ కేసును విచారించిన లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు, బాలుడి సంరక్షణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన నేరానికి మహ్రా అల్ నహ్యాన్‌కు రెండేళ్ల కమ్యూనిటీ ఆర్డర్ (సామాజిక నియంత్రణ ఉత్తర్వు) మరియు రిహాబిలిటేషన్ (పునరావాస) చర్యలను విధించింది. అదనంగా, మొత్తం 6,114 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 7 లక్షలకు పైగా) జరిమానా మరియు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.
ఘటన జరిగిన రోజు పశ్చిమ లండన్‌లోని ఒక రైల్వే గోడ పక్కన ఆమెతో పాటు మరో వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. ఆ చిన్నారి ప్రమాదకర రీతిలో రోడ్డు మధ్యలోకి వెళ్లడం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, అత్యవసర సేవా సిబ్బంది వచ్చేంతవరకు ఆ పిల్లాడిని సురక్షితంగా తమ ఆధీనంలో ఉంచారు.
సుమారు 30 నిమిషాల పాటు అపస్మారక స్థితిలోనే ఉన్న మహ్రా అల్ నహ్యాన్, స్పృహలోకి వచ్చిన తర్వాత “నాకు ఏమీ కాలేదు.. ప్రజలు ఎందుకు ఇంత కంగారుపడుతున్నారు?” అని వ్యాఖ్యానించినట్లు విచారణలో వెల్లడైంది. అయితే, డ్రగ్స్ ప్రభావంతో చిన్నారిని అంతటి అసురక్షిత పరిస్థితుల్లో వదిలేయడం పెను ప్రమాదానికి దారితీసేదని జడ్జి జెరెమీ జాన్సన్ హెచ్చరించారు.
ఈ సంఘటన అనంతరం మహ్రా అల్ నహ్యాన్ సర్రే ప్రాంతంలోని ఒక పునరావాస కేంద్రంలో చేరి చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఆమె మాదకద్రవ్యాల వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Leave a Reply