పంజాబ్‌లోని ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ మరోసారి విమర్శల పాలైంది. ఒక సివిల్ హాస్పిటల్లో వేలాది మంది రోగులకు కేవలం ఒక్కటే బీపీ (Blood Pressure) మెషిన్ ఉండటం, దాన్ని నిర్వహించాల్సిన సిబ్బంది విధుల్లో ఉండి మొబైల్ గేమ్ ఆడుతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
రత్తన్ ధిల్లాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్ పంజాబ్ ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిని కళ్లకు కట్టింది.
“బీపీ చెక్ చేస్తున్నప్పుడు కూడా ఆమె గేమ్ ఆడుతూనే ఉంది” ధిల్లాన్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నాడు: “పంజాబ్ ఆరోగ్య వ్యవస్థ వాస్తవికత ఇది. ఈ రోజు సివిల్ హాస్పిటల్‌కు వెళ్లాను, అక్కడ వేలాది మంది రోగులకు కలిపి కేవలం ఒక్కటే బీపీ మెషిన్ ఉంది. ఆ మెషిన్ దగ్గర ఉన్న సిబ్బంది లూడో గేమ్ ఆడటంలో బిజీగా ఉన్నారు!”
ఆమె గేమ్ ముగిసే వరకు తాను 10 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చిందని, పదే పదే అడిగిన తర్వాత కూడా ఆమె గేమ్ ఆడుతూనే తన బీపీని చెక్ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఎలాంటి పర్యవేక్షణ లేదు, బాధ్యత లేదు” అని ఆయన మండిపడ్డారు.
నెటిజన్ల స్పందన: ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు “కేవలం బీపీయే కదా” అని ఎద్దేవా చేయగా, మరికొందరు “లూడో గ్రూప్ గేమ్ కదా.. తోడుగా మరో ఇద్దరు ముగ్గురు ఉంటే బాగుండేది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ పనుల కోసం వెళ్తే, కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాల్సి ఉంటుందని, అక్కడ ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం దురదృష్టకరమని ధిల్లాన్ పేర్కొన్నారు.
స్పందించిన మంత్రి: ఈ వ్యవహారం వైరల్ కావడంతో పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ బల్బీర్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని కోరుతూ, విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
