తమిళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు విజయ్ ఆంటోనీ.
అయితే ఆయన పాల్గొనే సినిమా వేడుకలు, ఇతర బహిరంగ కార్యక్రమాల్లో చాలాసార్లు చెప్పులు లేకుండానే కనిపిస్తుంటారు. ఇంతటి పేరు, డబ్బు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ చెప్పులు ఎందుకు ధరించరనే ప్రశ్న చాలామందిలో ఉండేది.
తాజాగా ఈ ప్రశ్నకు ఆయన భార్య, నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోనీ భావోద్వేగంతో కూడిన సమాధానం వెల్లడించారు.
చెన్నైలో జరిగిన ఓ సినిమా వేడుకలో పాల్గొన్న ఫాతిమా.. తమ కుటుంబంలో జరిగిన తీరని విషాదం గురించి మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తమ పెద్ద కుమార్తె మీరా అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని మరణించిందని గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కుమార్తె కాలేజీకి వెళ్లే సమయంలో ధరించాలనే ఆశతో విదేశాల నుంచి ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన 50కి పైగా జతల షూస్, చెప్పులు ఇప్పటికీ ఇంట్లో భద్రంగా ఉన్నాయని ఫాతిమా తెలిపారు. వాటిని చూసిన ప్రతిసారీ విజయ్ ఆంటోనీకి కుమార్తె జ్ఞాపకాలు గుర్తుకొచ్చి తీవ్ర మనోవేదనకు గురవుతారని చెప్పారు.
అందుకే జీవితాంతం చెప్పులు ధరించకూడదని విజయ్ ఆంటోనీ నిర్ణయించుకున్నారని వెల్లడించారు. విదేశాల్లో జరిగే సంగీత కార్యక్రమాలకు వెళ్లినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చెప్పులు వేసుకుంటారని, కార్యక్రమం పూర్తయిన వెంటనే వాటిని తీసేస్తారని భావోద్వేగంగా వివరించారు.
అంతేకాదు.. తన దగ్గర లక్షల రూపాయల విలువైన ఖరీదైన వాచీలు ఉన్నప్పటికీ, తన కుమార్తె ఎంతో ఇష్టంగా కొనిచ్చిన సుమారు రూ.4 వేల విలువైన వాచ్నే ఇప్పటికీ విజయ్ ఆంటోనీ ధరిస్తున్నారని ఫాతిమా వెల్లడించారు.
ఓ తండ్రికి తన కూతురిపై ఉండే అపారమైన ప్రేమ, ఆమెను కోల్పోయిన తర్వాత మిగిలిపోయిన తీరని బాధకు ఈ ఘటన అద్దం పడుతోంది. ఫాతిమా చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ విజయ్ ఆంటోనీ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Leave a Reply