ఇరాన్ యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించిన వేళ, ట్రంప్ తన ప్రణాళికను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ‘హోర్ముజ్ జలసంధి’ని కచ్చితంగా తెరిపించి తీరుతామని చెబుతూ వచ్చిన ట్రంప్, ఇప్పుడు నెమ్మదిగా ఆ విషయాన్ని పక్కన పెడుతున్నారు. ఎలాగైనా ఈ యుద్ధాన్ని ముగించి బయటపడితే చాలు అనే స్థితికి ట్రంప్ చేరుకున్నట్లు సమాచారం అందుతోంది.
గత ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించాయి. మొదటి రోజే ఖమేనీ వంటి కీలక నేతలు హతమవడంతో యుద్ధం త్వరగానే ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, ఇరాన్ ఎదురుదాడిని కొనసాగించడంతో పోరాటం 5వ వారానికి చేరింది.
ట్రంప్ వ్యూహం: ఈ యుద్ధం ఇంత కాలం సాగుతుందని అమెరికా ఊహించలేదు. అందుకే ఇప్పుడు ఈ ఘర్షణ నుండి బయటపడాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధిని తెరిపించకపోయినా పరవాలేదు కానీ, ఇరాన్‌పై చేపట్టిన “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” (Operation Epic Fury) అనే సైనిక చర్యను ముగించాలని ట్రంప్ తన సహాయకులతో అన్నట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది.
మారిన ప్లాన్: హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిపించే ప్రయత్నం చాలా క్లిష్టమైనదని, అది మొదలుపెడితే యుద్ధం అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ట్రంప్ ప్రాధాన్యత హోర్ముజ్ మీద లేదు. అయితే మరోవైపు అమెరికా తన బలగాలను మధ్యప్రాచ్యంలో మోహరిస్తూనే ఉంది. గత వారాంతంలో 2,500 మంది సైనికులతో కూడిన యుద్ధనౌకను, మరో 10,000 మంది పదాతి దళాలను ట్రంప్ అక్కడికి పంపారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను స్వాధీనం చేసుకునే ప్రమాదకరమైన ప్లాన్ గురించి కూడా ట్రంప్ ఆలోచిస్తున్నారు.
ప్లాన్-బి: క్లుప్తంగా చెప్పాలంటే, హోర్ముజ్ జలసంధిపై దృష్టి పెడితే యుద్ధం 6 వారాల్లో ముగియదని సలహాదారులు చెప్పడంతో ట్రంప్ తన టార్గెట్‌ను మార్చారు. హోర్ముజ్ జోలికి వెళ్లకుండా ఇరాన్ ఆయుధశాలలను బలహీనపరచడం, అణు కార్యక్రమాలను తుడిచిపెట్టడం అనే లక్ష్యాలపైనే ఇప్పుడు అమెరికా దృష్టి పెట్టింది. అయితే, హోర్ముజ్ సమస్యను పరిష్కరించకుండా అమెరికా వెనక్కి తగ్గితే, ఆ ప్రాంతంపై ఇరాన్ పట్టు పెరుగుతుందని, అది అంతర్జాతీయ ఇంధన సరఫరాపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
