మనిషి బతికున్నప్పుడే సరైన గౌరవం, హక్కులు దక్కడం లేదనుకుంటే.. చనిపోయిన తర్వాత కనీసం ఆ మృతదేహానికైనా కాస్త మానవత్వం, మర్యాద దక్కద్దా? అలాంటి ఓ అత్యంత అమానుష ఘటనే బీహార్ రాష్ట్రంలోని ససారామ్ (Sasaram) ప్రాంతంలో చోటుచేసుకుని, ఆ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెట్టింది.
కేవలం 16 ఏళ్ల వయసున్న లక్ష్మీ కుమారి అనే బాలిక మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి, ట్రాక్టర్ వెనుక ఉండే ఇనుప నాగలికి (కల్టివేటర్‌కు) వేలాడదీసి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
బీహార్ రాష్ట్రం బిక్రమ్‌గంజ్ (Bikramganj) ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక లక్ష్మీ కుమారి, రెండు నెలల క్రితం పింకు బింద్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత దుమర్‌కోహ్ అటవీ ప్రాంతంలో భర్తతో కలిసి నివసిస్తోంది.
ఈ క్రమంలో, కొద్ది రోజుల క్రితం అక్కడున్న ఓ పాడుబడిన బావిలో లక్ష్మి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ లేదా సరైన ప్రభుత్వ వాహనాన్ని ఏర్పాటు చేయాల్సింది. కానీ, ఏమాత్రం మానవత్వం లేకుండా ట్రాక్టర్ వెనుక అమర్చిన ఇనుప నాగలిపై బాలిక మృతదేహాన్ని గోనెసంచిలో వేసి కట్టి వేలాడదీశారు.
అదే స్థితిలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ససారామ్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్లారు. దారి పొడవునా ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యారు.
మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకొచ్చిన అమానుష తీరును చూసి షాక్ అయిన వైద్యులు, అక్కడ పోస్టుమార్టం చేయడానికి నిరాకరించారు. మృతదేహం అత్యంత దారుణమైన స్థితిలో ఉండటంతో తదుపరి పరీక్షల నిమిత్తం పాట్నాకు పంపించినట్లు డాక్టర్ అజిత్ కుమార్ తెలిపారు.
ఈ హత్య కేసుకు సంబంధించి కొందరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, “ఒక మనిషి మృతదేహానికి కూడా గౌరవప్రదమైన అంతిమ ప్రయాణాన్ని కల్పించలేని స్థాయికి ప్రభుత్వ యంత్రాంగం దిగజారిపోయిందా?” అనే ప్రశ్నతో పాటు, “దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటారా?” అనే ఆగ్రహం ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది.

Leave a Reply